వేలం వేసిన ధాన్యం తరలింపులో కాంగ్రెస్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు.. సదరు కాంట్రాక్టర్లు అనుసరిస్తున్న వ్యవహారంపై ప్రస్తుతం రైస్ మిల్లర్లలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే కాంట్రాక్టర్లకు ప్రభుత్వంలో కొంత మంది పెద్దలు వంత పాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, కాంట్రాక్టర్ల ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. ముందుకెళ్లాలనే అభిప్రాయాలను మెజార్టీ మిల్లర్లు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఏమాత్రం తలొగ్గినా అసలుకే ఎసరు వస్తుందన్న ఉద్దేశం కనిపిస్తున్నది. అందు కోసం.. కలిసికట్టుగా ఎదుర్కోవడం తమకు ఒక్కటే మార్గమన్న అభిప్రాయాలు వ్యక్తం కాగా.. అందరూ కలిసి ఆ దిశగా ఆడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో కాంట్రాక్టర్లతో అంటకాగుతున్న కొంత మంది మిల్లర్లు మాత్రం తెరవెనుక మంతనాలు నడుపుతున్న తీరు ప్రస్తుతం చర్చనీయాశంగా మారుతున్నది.
కరీంనగర్, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించి 35 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఫిబ్రవరిలో వేలం వేసింది. ఈ వేలాన్ని నాలుగు కాంట్రాక్టు సంస్థలు దక్కించుకున్నాయి. మిల్లులు, గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు ఒక్కో క్వింటాల్‌కు అన్ని ఖర్చులు కలిపి 2007 చొప్పున కొనుగోలు చేశాయి.
నిబంధనల ప్రకారం టెండర్ లెటర్ ముట్టినప్పటి నుంచి వేలంలో కొన్న ధాన్యాన్ని మూడు నెలల్లో సదరు కాంట్రాక్టర్లు లిఫ్ట్ చేయాలి. కానీ, ఇప్పటివరకు కేవలం 20 శాతం ధాన్యం కూడా లిఫ్ట్ చేయలేదు. తమ వద్ద ఉన్న ధాన్యం తీసుకెళ్లాలని మిల్లర్లు చెబుతున్నా సదరు కాంట్రాక్టర్లు మాత్రం విముఖత చూపుతున్నారు. అంతేకాదు, ధాన్యానికి బదులుగా క్వింటాల్‌కు 2,223 ధర కట్టించి ఇవ్వాలనే షరతు పెడుతున్నారు. అంటే ఒక్కో క్వింటాల్‌పై 216 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని లోతుగా చూస్తే వందలాది కోట్ల కుంభకోణం ఉన్నట్టు తెలుస్తున్నది.
ప్రధానంగా ఈ బాగోతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల హస్తం ఉండడంతో కాంట్రాక్టర్లు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్టుగా మారిందన్న అభ్రిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అడిగిన డబ్బులు ఇవ్వని మిల్లర్లపై బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. భయపడిన పలువురు మిల్లర్లు ఇప్పటికే కాంట్రాక్టర్లు అడిగినట్టు క్వింటాల్‌కు 2,223 చెల్లించారు. అందుకు సబంధించి చెల్లించిన మొత్తం వివరాలు, ఆ లేఖలను సదరు మిల్లర్లు అసోసియేషన్‌కు అప్పగించారు. అయితే, చెల్లింపు చేసిన మిల్లర్లు లేఖలను చూపిస్తూ.. ఇతర మిల్లర్లపై కూడా సదరు కాంట్రాక్టర్లు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ అంశంపై ప్రస్తుతం మిల్లర్లలో పెద్ద చర్చ నడుస్తున్నది.
గత ప్రభుత్వం సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చిన ధాన్యాన్ని పెద్దమొత్తంలో మిల్లర్లు మార్కెట్లో అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. నిజానికి కొంత మంది మాత్రమే ఈ తరహాలో అడ్డదారి తొక్కినట్టు తెలుస్తున్నది. అయితే, మొత్తం మంది మిల్లర్లు ధాన్యం అమ్ముకున్నారని, టెండర్ దక్కించుకున్న తర్వాత ధాన్యం ఇవ్వాలంటే ఎవరూ ఇవ్వర ని, దాంతో మనం చెప్పిందే వేదంగా నడుస్తుందని కొంతమంది మిల్లర్లు ఇచ్చిన సమాచారంతోనే కాం ట్రాక్టర్లు వేలంలో పాల్గొన్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందన్న విమర్శలు కూడా ఉన్నాయి.
టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ధాన్యం తీసుకెళ్లడానికి ముందుకు రా గా.. మెజార్టీ మిల్లుల్లో ధాన్యం నిల్వలు ఉన్నాయి. అది చూసి సదరు కాంట్రాక్టర్లు కంగుతిన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లాక.. కథ అడ్డం తిరిగిందన్న విషయా న్ని తెలుసుకొని.. రకరకాల కారణాలు చూపుతూ తమకు కచ్చితంగా.. క్వింటాల్‌కు 2,223 చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా ఎదురు తిరిగిన రెండు మూడు మిల్లులపై పౌరసరఫరా శాఖకు చెందిన విజిలెన్స్ విభాగం ద్వారా దా డులు చేయించారు. ఈ దెబ్బకు భయపడిన కొంత మంది మిల్లర్లు ఇప్పటికే డబ్బులు చెల్లించారు. కానీ, మెజార్టీ మిల్లర్లు మాత్రం ధాన్యం తీసుకెళ్లాలని చెప్పడంతో కాంట్రాక్టర్లు కాలయాపన చేస్తూ వచ్చారు.
గడువు పొడిగిస్తే సదరు కాంట్రాక్టర్లు తిరిగి పాత పద్ధతే అనుసరించే అవకాశమే అధికంగా కనిపిస్తున్నది. ధాన్యం ఎత్తకుండానే అనుకున్న ప్రకారం క్వింటాల్‌కు 2,223 వసూలు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు మిల్లర్లలో చర్చ నడుస్తున్నది. అంతేకాదు, అడిగిన మొత్తం ఇవ్వకపోతే వివిధ శాఖల ద్వారా మిల్లులపై దాడులు చేయిస్తారంటూ అంటకాగే కొంత మంది మిల్లర్లు ప్రచారం చేస్తున్నారు.
అయితే, మెజార్టీ మిల్లర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంట్రాక్టర్ల ఒత్తిడికి తలొగ్గొద్దనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తున్నది. సమష్టిగా ఎదిరించాలనే నిర్ణయానికి రావడమే కాదు, ఈ విషయాన్ని రైస్‌మిల్లర్ల అసోసియేషన్లతోనూ చర్చించినట్టు తెలుస్తున్నది. మెజార్టీ మిల్లర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఎదురొడ్డి పోరాడాలని, అలా కాకుండా ఒక్కసారి తలొగ్గితే అసలుకే ఎసరు వస్తుందని మెజార్టీ మిల్లర్లు వాదిస్తున్నారు. ఒకరిద్దరు మిల్లర్లు చేసిన తప్పులకు.. అందరిపై భారం మోపడం సముచితం కాదన్న వాదనను వారు వినిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అసోసియేషన్లు కూడా మెజార్టీ మిల్లర్ల అభిప్రాయాల వైపు మొగ్గు చూపడంతోపాటు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో.. ప్రభుత్వం మున్ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న దానిపై చర్చ జరుగుతుండగా.. అసోసియేషన్లు కూడా గట్టిగా పోరాడుతాయా..? లేక ప్రభుత్వం, కాంట్రాక్టర్ల ఒత్తికి తలొగ్గి.. మిల్లర్ల ద్వారా అడిగిన మొత్తాన్ని చెల్లింపు చేసేలా చూస్తాయా..? అన్నది మున్ముందు తేలనునన్నది. దీంతోపాటు రైస్‌మిల్ అసోసియేషన్లు.. వారి వారి ప్రయోజనాలకోసం పాకులాడుతారా..? లేక మిల్లర్ల వైపు నిలిచి పోరాడుతారా..? అన్నదానిపై భిన్న రకాల చర్చలు ప్రస్తుతం మిల్లర్ వర్గాల్లో నడుస్తున్నాయి.
నిబంధనల ప్రకారం మూడు నెలల గడువు ఈ నెల 23తో ముగుస్తుంది. ఆలోగా ధాన్యం మొత్తం కాంట్రాక్టర్లు లిఫ్ట్ చేయాలి. కానీ, ఉమ్మడి జిల్లా మొత్తం మీద వేలం వేసిన ధాన్యంలో 20 శాతం కూడా ఎత్తలేదు. ఇంకా 80 శాతం ధాన్యం మిల్లులు, గోదాముల్లోనే ఉంది. దీంతో సదరు కాంట్రాక్టర్లు గడువు పొడిగింపు కోసం ప్రభుత్వం వద్ద ఫైలు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. అందులో ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందన్న విమర్శల నేపథ్యంలో మరో మూడు నెలల గడువు పొడిగింపు రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, మూడు నాలుగు రోజుల్లో అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడుతాయన్న సమాచారం అందుతున్నది.