Odela | ఓదెల, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేస్తూ యాజమాన్యాలకు, పెట్టుబడుదారులకు, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్స్ ను జారీ చేయడానికి నిరసిస్తూ ఓదెల మండల కేంద్రంలో గురువారం కార్మికులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఓదెల మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి లేబర్ కోడ్స్ రద్దు చేయాలని తహసీల్దార్ ధీరజ్ కుమార్ గౌడ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల కార్మికులందరికీ నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక, వ్యవసాయ కూలీ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జ్యోతి, పైడిపల్లి నాగయ్య, ఆకుల నరేష్, శనిగరం బాపు, స్వప్న, కనికి రెడ్డి తిరుపతి, మిట్టపల్లి రాజేందర్, సారయ్య, కాదాశి కుమార్, రాజేశ్వరి, సుమలత తదితరులు పాల్గొన్నారు.