NREGS | మంథని, ఏప్రిల్ 26: తాము కష్టపడి పని చేసే దానికి విలువ లేకుండా కూలీ డబ్బులు తక్కువగా చెల్లిస్తున్నారంటూ ఉపాధి హామీలు కూలీలు ఎంపీడీవో, ఈజీఎస్ కార్యాలయాల సమీపంలో శనివారం ఆందోళనకు దిగారు. ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ మండలంలోని చిల్లపల్లి గ్రామ పంచాయతీలో మొత్తం 320 మందికి జాబ్ కార్డులుండగా ఈ ఏడాది కరువు పనికి 80 మంది వరకు హాజరవుతున్నామని, మాకు ఫీల్డ్ అసిస్టేంట్ లేక పోయినప్పటికీ మేటీ ద్వారా పనులు నిర్వహిస్తున్నామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు రూ.307 చెల్లిస్తుండగా మాకు మాత్రం రూ.80 నుంచి రూ.120 వరకు పడుతున్నాయని మహిళలంతా ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ డబ్బులు వస్తున్నాయనే ఉపాధి హామీ పనులకు ఎక్కువ సంఖ్యలో కూలీలు హాజరుకావడం లేదని, ఎలాంటి ఆధారం లేని తాము కూలీ పనులకు వస్తే తమకు కూలీ తక్కువగా చెల్లిస్తున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు పెట్టిన కోలతల ప్రకారం తాము పనులు చేస్తున్నప్పటికీ తమకు కూలీ రూ.307 చెల్లించకుండా గత ఐదు వారాలకు సంబంధించి ఉపాధి హామీ కూలీ వేతనం రూ.80 నుంచి రూ. 120 వరకు మాత్రమే చెల్లించారన్నారు.
దీనిపై అధికారులకు అడిగినప్పటికీ ఎలాంటి సమాధానం ఇవ్వక పోవడం వల్లనే కార్యాలయంకు వచ్చి ఆందోళనకు దిగినట్లు వారు వెల్లడించారు. అంతే కాకుండా ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో మాకు ఎలాంటి వసతులు లేవని, తాగునీటి, టెంట్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరినా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. మా గ్రామ పంచాయతీలో 300 మంది ఉపాధి హామి జాబ్ కార్డు కలిగిన వారు ఉండగా వారికి కాకుండా అర్హత లేని వారిని అధికారులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఎంపిక చేశారని ఆరోపించారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళ వద్ద ఎంపీడీవో శశికళ, ఏపీవో సదానందం, ఉపాధి హామీ పథకం అధికారులు వచ్చి వారిని శాంతింప చేశారు.
ఉపాధి హామీ కూలీ వేతనాలతో పాటు పని చేయకుండా ఎవరైనా కూలీ డబ్బులు తీసుకొని ఉంటే విచారణ చేస్తామన్నారు. ఈ నెల 1 నుంచి చేస్తున్న కూలీ డబ్బులు రూ. 200లపైనే వస్తాయని వారికి వివరించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా రాష్ట్రం నుంచే ఎంపిక చేశారని, గత సంవత్సరం ఉపాధి హామీ పనులు చేసిన వారి పేర్లు వచ్చాయని, దీనిపై కూడా విచారణ చేసి అనర్హుల పేర్లు తొలగించేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.