Anganwadi | కలెక్టరేట్, మార్చి 09 : అంగన్వాడి కేంద్రాల్లోని ఖాళీల భర్తీపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది.. ఇందుకోసం అవసరమైన సన్నాహాలు చేస్తున్నాం.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాం.. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీల ప్రకటన చేస్తున్నాం అంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇటీవల ఓ సమావేశంలో ప్రకటించింది.
ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది ఖాళీ పోస్టులు ఒకేసారి భర్తీ చేయబోతున్నామంటూ వెల్లడించింది. అంగన్వాడిలో విధులు నిర్వహిస్తున్న వారితోపాటు, నిరుద్యోగ మహిళల్లో కూడా ఆశలు మొదలయ్యాయి. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల కోసం ఆశావహులంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన సన్నాహాలు చేయటంలో ఎలాంటి కదలిక లేదని తెలుస్తుంది. దీంతో నోటిఫికేషన్ విడుదలపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రిక్రూట్మెంట్ అంశంలో గతంలో మాదిరి కాకుండా ఈసారి కేంద్రం కొత్త నిబంధనలు తెచ్చింది. విద్యార్హతల పెంపుతో పాటు నిర్దిష్ట వయస్సు వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేలా విధివిధానాలు పాటించాలంటూ ప్రకటించింది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో పాటు, 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలు మాత్రమే దరఖాస్తులు చేసుకునేలా అవకాశం కల్పించింది. వారికి అవసరమైన రాత పరీక్షలు నిర్వహించి వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక చేపట్టేలా ఆదేశాలు జారీ చేసింది. వీటిని పరిగణలోకి తీసుకుని, క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించి జిల్లాలకు పంపాలి. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని సమాచారం. జిల్లాల్లో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక కమిటీలు ఏర్పాటు కలిసి ఉంటుంది.
గతంలో పది ఉత్తీర్ణతతోనే నియామకాలు చేపట్టగా, తాజాగా కేంద్రం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు అనుసరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జిల్లాలకు కూడా ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. వీటిని అమలు చేస్తే మహిళల్లో వ్యతిరేకత వచ్చే ఉంటుందని ఆలోచనతో వెనుకాడుతున్నట్లు ఆ శాఖ వర్గాల భోగట్టా. దీంతో నోటిఫికేషన్ విడుదల గతంలో మాదిరిగా ఈసారి కూడా ఊరించి.. ఊదరగొట్టినట్లే అవుతుందా? అనే అనుమానం ఆశావహుల నుంచి వ్యక్తం అవుతుంది. ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తే మాత్రం ఉమ్మడి జిల్లాలోని 2,135 కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 235 టీచర్ పోస్టులు, 899 ఆయాల పోస్టులు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోని 777 కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 69 టీచర్, 202 ఆయా పోస్టులు భర్తీ కానున్నాయి.