నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు అందగా, ప్రస్తుతం రైతులకు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతుండడంతో లో ఓల్టేజీ సమస్యలు ఎదురై మోటర్లు కాలిపోతున్నాయి. గంటలో నాలుగైదు సార్లు అంతరాయం ఏర్పడుతుండగా రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కరీంనగర్ శివారులోని గోపాల్పూర్, దుర్శేడు, బొమ్మకల్ తదితర ప్రాంతాల్లోనే ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తుంటే మారుమూల ప్రాంతాల్లో ఇంకెంతగా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు..
కరీంనగర్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో కరెంట్ కోతలు మొదలయ్యాయి. విద్యుత్ వినియోగం నానాటికీ పెరుగుతోంది. గతేడాది ఇదే నెలలో జిల్లా కోటా 695 మెగావాట్లు ఉండేది. ఈ సంవత్సరం కాస్త 922 మెగావాట్లకు పెంచారు. గతేడాది ఈరోజున 12.213 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ రోజు 14.544 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే విద్యుత్ వినియోగం ఎంతలా పెరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అయితే, డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక పోవడంతో వివిధ రంగాలపై, ముఖ్యంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యవసాయానికి రాత్రి 11.30 నుంచి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటల వరకు త్రీ ఫేస్ సరఫరా, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 11.30 వరకు సింగిల్ ఫేస్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కానీ, 13-14 గంటలకు మించి వ్యవసాయానికి సరఫరా చేయడం లేదని రైతులు అంటున్నారు. ఇచ్చే విద్యుత్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఉదయం 6 నుంచి 9, 10 గంటల వరకు వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తులో అంతరాయం కలుగుతోంది. గంటలో నాలుగైదు సార్లు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చీరాని కరెంట్‌తో కాలువలు కూడా సాగడం లేదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు బావులు, బోర్లలో నీళ్లు అడుగంటుతున్నాయి. పంటలకు సమయానికి నీళ్లు అందక ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి కరెంట్‌ను వినియోగించుకుని పొలాలు పారించుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులకూ చుక్కెదురవుతోంది. వ్యవసాయానికి ఉన్న ప్రత్యేక ఫీడర్లలో తరుచూ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో రైతులు బావుల వద్దనే రాత్రులు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Karimnagar
తీవ్రమవుతున్న లో ఓల్టేజీ సమస్యలు
డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేని కారణంగా అనేక చోట్ల లో ఓల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక పక్క సరఫరాలో తరుచూ అంతరాయం.. మరో పక్క నాణ్యమైన కరెంట్ సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లో ఓల్టేజీతో కరెంట్ మోటర్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లపైనా భారం పడుతోంది. అయినా, పట్టించుకునే వారు కరువయ్యారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్ శివారులోనే ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. నగరానికి ఆనుకుని ఉన్న గోపాల్పూర్, దుర్శేడు, బొమ్మకల్ తదితర గ్రామాల్లో లోఓల్టేజీ సమస్యతో మోటర్లు కాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
ఈ యాసంగి సీజన్లో ఒక్కో రైతు మోటరు రెండు, మూడు సార్లు కాలిపోయినట్లు తెలుస్తోంది. మోటర్లు రీవైండింగ్ చేయించడం రైతులకు భారంగా మారుతోంది. హెచ్‌పీని బట్టి ఒక్కో మోటర్ రీవైండింగ్ చేయాలంటే రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చవుతోంది. తరుచూ మోటర్లు కాలుతుండడంతో వైండర్లకు డిమాండ్ పెరుగుతోంది. కాలిపోయిన మోటర్‌ను రీవైండింగ్ చేయించేందుకు రెండు మూడు రోజులు పడుతోంది. ఈ లోగా పొలాలు ఎండి పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మోటర్లు కాలిన రైతులు చాలా మంది వెంటనే కొత్త మోటర్లు కొని తెచ్చుకుంటున్నారు. రైతులకు ఇది అధిక భారంగా మారుతోంది.

Karimnagar
మళ్లీ ఉమ్మడి రాష్ట్ర రోజులు
ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. వ్యవసాయానికి నిర్ణీత సమయాల్లోనే కరెంట్ ఇచ్చే వారు. ఇప్పుడు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరుకే 24 గంటల ఉచిత విద్యుత్ అన్నట్లుగా ఉంది. అధికారులు ఇచ్చే విద్యుత్ సరఫరా సమయాలు లెక్కిస్తే 19 గంటలు కాగా, 13 నుంచి 14 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని చెబుతున్నారు. ఇచ్చిన విద్యుత్‌లో నాణ్యత లేక పోవడంతో తరుచూ అంతరాయం ఏర్పడుతోంది. ఈ కారణంగా ఏర్పడుతున్న లో ఓల్టేజీతో విద్యుత్ మోటర్లు కాలిపోతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ముందుగా విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చింది. క్రమంగా వ్యవసాయానికి సరఫరాను పెంచింది. 24 గంటల ఉచిత విద్యుత్‌ను కూడా విజయవంతంగా నిర్వహించింది. ఈ సమయంలో రైతులు ఎంతో ధీమాతో కనిపించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అవసరం ఉన్నపుడే విద్యుత్ వినియోగించుకునే వారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. కరెంట్ కోసం గతంలో మాదిరి ఆందోళనలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మోటర్లు కాలుతున్నయి
లో ఓల్టేజీతో విద్యుత్ మోటర్లు కాలిపోతున్నయి. ఎండలు ముదరక ముందే రైతులు పంటలకు నీళ్లు పెట్టుకుంటరు. ఇదే సమయంలో గృహ, ఇతర పరిశ్రమలకు కూడా విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో వ్యవసాయానికి వచ్చే కరెంట్ సరిపోవడం లేదు. గంటలో రెండు మూడు సార్లు ఇంట్రాప్షన్ వస్తంది. లో ఓల్టేజీ సమస్య ఎదురవుతోది. ఈ సమయంలో నడుస్తున్న కరెంట్ మోటర్లపై ప్రభావం పడుతోంది. ఫలితంగా అవి కాలిపోతున్నయి. ఈ విషయం అధికారులకు చెప్పినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. లో ఓల్టేజీతో కాలిపోయిన మోటర్లు రీ వైండింగ్ చేసేందుకు అడ్డగోలు పైసలు ఖర్చవుతున్నయి. రెండు మూడు సార్ల కాలిపోయిన మోటర్లు పని చేయడం లేదు. విధి లేక కొత్తవి కొనుక్కుంటున్నాం. పంటలు చివరి దశలో ఉండగా కరెంట్ సరఫరా సరిగ్గా లేక రైతులు ఆందోళన చెందుతున్నరు
– మంద తిరుపతి, గోపాల్పూర్ రైతు