రైతులందరికీ ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తానని మొండిచెయ్యి చూపిన సర్కారు, ఇప్పుడు మళ్లీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. సర్వేచేసి అర్హులైన వారికి అందేలా చూస్తామని వారం పది రోజులుగా కబుర్లకే పరిమితమైపోయింది. ఓ వైపు గ్రీవెన్స్‌లో దరఖాస్తుల పరిశీలనకు ‘రైతు భరోసా- రుణమాఫీ’ పేరుతో ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించి అందించినా, విధి విధానాలు రూపొందించలేదని తెలిసింది.
ఏవిధంగా సర్వే చేయాలి? ఎలా అప్లోడ్ చేయాలి? అనే విషయాలపై స్పష్టత లేదని, సర్వేకు యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తున్నది. ప్రస్తుతం అందించిన అప్లికేషన్లోనూ కేవలం కుటుంబ సభ్యుల నిర్ధారణకు మాత్రమే అవకాశం ఇచ్చిందని అధికారులు చెబుతుండగా, మరి మిగతా సమస్యల సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అసలు సర్వే చేస్తారా..? రాని వారికి రుణమాఫీ ఇస్తారా..? అని అనుమానపడుతున్నారు.
కరీంనగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు పదే పదే చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కొర్రీలు పెడుతున్నారు. ఫలితంగా వేలాది మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. రైతులందరికీ ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పినా అదీ అమలు కాలేదు. పైగా మూడు విడతల్లో మాఫీ చేసినా అనేక తప్పిదాలతో రైతులు రోడ్డెక్కే దుస్థితి వచ్చింది.
రైతుల నిరసన సెగలకు రాష్ట్ర ప్రభుత్వం దిగిరావల్సి వచ్చింది. రుణమాఫీ కాని రైతులు రైతు వేదికలు, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ దరఖాస్తులు చేసుకున్న వారిలో 33 శాతానికి పైగా రేషన్ కార్డులు లేకనే రుణమాఫీకి నోచుకోలేదని నిర్ధారణకు వచ్చారు. కరీంనగర్ జిల్లాలో గ్రీవెన్స్‌లో మొత్తం 8,870కిపైగా దరఖాస్తులు వస్తే, అందులో 2,870 వరకు రేషన్ కార్డులు లేకనే ఆగిపోయినట్టు గుర్తించారు. వీటిని పరిశీలించి రుణమాఫీ వచ్చేలా చేసేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా ‘రైతు భరోసా- రుణమాఫీ’ పేరుతో ఒక యాప్‌ను రూపొందించింది.
రెండు రోజుల క్రితమే ఈ యాప్‌ను వ్యవసాయ శాఖకు ఇచ్చింది. అయితే కేవలం కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసమే మండల వ్యవసాయ అధికారులకు మాత్రమే లాగిన్ అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరంతా శని, ఆదివారాల్లో ఒక్కో రైతు వివరాలను సేకరించి ట్రయల్ కూడా ముగించారు.
అంతా సవ్యంగానే ఉండగా తదుపరి ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు యాప్ విధి విధానాలు రూపొందించనట్లు తెలుస్తున్నది. అధికారులు ఏవిధంగా సర్వే చేయాలి? ఎలా అప్లోడ్ చేయాలి? అనే విషయాలపై మార్గదర్శకాలు వచ్చిన తర్వాతనే సర్వే చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రతి మంగళవారం కొన్ని ఎంపిక చేసిన రైతు వేదికల్లో నిర్వహిస్తున్న రైతు నేస్తంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సర్వేకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
మిగతా సమస్యలు ఎలా..?
రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు కొర్రీలు పెట్టడంతో మెజార్టీ రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ప్రభుత్వం విధించిన కటాఫ్ డేట్‌లోగా 2 లక్షలలోపు, ఆపైన అప్పు తీసుకున్న రైతుల జాబితాను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఎంత మంది అర్హులు ఉన్నారనే విషయం ఇప్పటి వరకు ఇటు అధికారులకుగానీ, అటు బ్యాంకర్లకుగానీ సరైన సమాచారం లేదు.
కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో లక్ష లోపు ఉన్న 38,894 మందికి 201.46 కోట్లు, రెండో విడతలో 1.50 లక్షల వరకు ఉన్న 19,420 మందికి 182.44 కోట్లు, మూడో విడతలో 2లక్షల వరకు ఉన్న 12,034 మంది రైతులకు 152.65 కోట్ల చొప్పున మొత్తం మూడు విడతల్లో 70,348 మంది రైతులకు 536.55 కోట్లు మాఫీ చేసింది. మూడో విడత జాబితా విడుదలైన తర్వాత మెజార్టీ రైతుల పేర్లు గల్లంతు కావడంతో బ్యాంకుల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు.
ఎక్కడ చూసినా ఆందోళనలు మిన్నంటడంతో గ్రీవెన్స్‌లో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే వేలాది మంది రైతులు రుణమాఫీకి నోచుకోకపోగా కేవలం 8,870 దరఖాస్తులు మాత్రమే గ్రీవెన్స్‌లో వచ్చాయి. దరఖాస్తు చేసుకోని వారు ఇంకా వేల సంఖ్యలోనే ఉన్నారు. అయితే వచ్చిన దరఖాస్తుల్లో కేవలం కుటుంబ సభ్యుల నిర్ధారణకు అంటే రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలను గుర్తించి వారిలో ఎంత మంది రుణం తీసుకున్నారు? 2 లక్షల రుణం వర్తిస్తుందా? లేదా అనే విషయాలను మాత్రమే మండల వ్యవసాయ అధికారులు పరిశీలించనున్నారు.
అయితే ఆధార్ నంబర్ సరిగ్గా లేక, పేర్లు, తండ్రి పేర్లు కలవక, బ్యాంకు వివరాలు సరిగ్గా లేకపోవడం, ఖాతాలో జమ చేసిన నగదు వాపసు వెళ్లడం వంటి అనేక సమస్యల కారణంగా రుణమాఫీ కాని రైతులు ఇంకా వేల సంఖ్యలో ఉన్నారు. అయితే వీటిలో కొన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యతలను బ్యాంకర్లకు కూడా అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కానీ, బ్యాంకర్లు ఎంత వరకు అంగీకరిస్తారనేది సందేహమే.
అఫిడవిట్ ఇవ్వాల్సిందేనట!
తమకు రుణమాఫీ కావాలంటే రైతులు అఫిడవిట్ ఇవ్వాల్సిందేనట. భార్యాభర్తలు రుణం తీసుకున్న కుటుంబాల్లో 2 లక్షల వరకు మాఫీకాని రైతుల విషయంలో ప్రభుత్వం రేపోమాపో నిర్వహించే సర్వేలో రైతులు తమ కుటుంబ సభ్యులేనని ధ్రువీకరించాల్సి ఉంటుంది. 18 ఏండ్లు నిండిన ప్రతి కుటుంబ సభ్యుడి పేరును ప్రభుత్వానికి రాసి ఇవ్వాలి. రైతులు రాసి ఇచ్చిన పేర్లు ఇతని కుటుంబానికి సంబంధించినవేనని పంచాయతీ కార్యదర్శి అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. దానిని మండల వ్యవసాయ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా రైతు తీసుకున్న రుణం ఎంత? ఏ బ్యాంకు, ఏ శాఖ తదితర విషయాలు అధికారులకు అందించాల్సి ఉంటుంది. మండల వ్యవసాయ అధికారులు కూడా వాళ్లు సర్వే చేసిన ప్రతి కుటుంబంతో సెల్ఫీ దిగాల్సి ఉంటుంది. త్వరలో ప్రారంభించే కుటుంబ సభ్యుల నిర్ధారణ సర్వే ఇన్ని షరతులతో కూడుకుని ఉంది. రుణమాఫీ కావాలంటే ఇవన్నీ తప్పని సరి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
2 లక్షలు మాఫీ కావాలంటే..
వివిధ బ్యాంకుల్లో 2లక్షలకంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకున్న రైతులుగానీ, 2 లక్షలు తీసుకుంటే వడ్డీ కలిపి మాఫీ మార్క్ దాటిన రైతులుగానీ, అదనంగా ఉన్న నగదును బ్యాంకుల్లో చెల్లిస్తేనే ప్రభుత్వం 2 లక్షలు మాఫీ చేస్తుందని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తున్నది. మూడు విడుతల్లో మాఫీ చేసే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2.50లక్షలకు ఒక సారి, 3లక్షల వరకు రెండో సారి, 3 లక్షల పైన ఉన్న వాటికి మూడోసారి షెడ్యూల్ విడుదల చేసి విడతల వారీగా మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అయితే ఈ విషయంలో రైతుల వాదన మరో విధంగా ఉంది. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉండాలని, రైతులు బ్యాంకుల్లో ఎంత బాకీ ఉన్నా ఇదే విడుతల వారీగా మాఫీ చేయాలని స్పష్టం చేస్తున్నారు. తమకు వీలున్నపుడు మిగతా మొత్తం చెల్లించి తిరిగి రుణాలు తీసుకుంటామని అంటున్నారు.
రూ.2లక్షలు ప్రభుత్వమే చెల్లించాలి
రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వానికే స్పష్టత లేదు. రెండు లక్షలకు పైన ఉన్న రైతులు ముందుగా ఎట్లా చెల్లిస్తరు? బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినా ఇపుడు రైతుల వద్ద డబ్బులు ఉండాలి కదా! ఒక్కో రైతు మూడునాలుగు లక్షలు రుణం తీసుకుని ఉన్నరు. కొంత మందికి అంతకంటే ఎక్కువే ఉన్నయి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రెండు లక్షల కోసం రైతులు మళ్లా బయట అప్పులు చేయాల్నా..? ఇస్తానన్న 2 లక్షలు ఇచ్చేస్తే సరిపోతది కదా! ప్రభుత్వమే ముందు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంటది. రుణమాఫీ జరిగిన రైతులు కూడా సంతోషంగా లేరు. మా ఊళ్లో రెడ్డి వీరయ్య అనే రైతు 1.30 లక్షలు తీసుకున్నడు. వడ్డీతో కలిపి 1,36,500 అయ్యింది. ప్రభుత్వం ఏం చెప్పింది? మిత్తితో సహా చెల్లిస్తామని చెప్పింది కదా! మరీ వీరయ్యకు మాత్రం గత డిసెంబర్ 9 వరకే 1.32 లక్షలు ఇచ్చింది. ఆయన మిగతా 4,500 చెల్లించే వరకు బ్యాంకోళ్లు రెన్యువల్ చేయలేదు. వీరయ్య బాకీ ఉన్నది 2 లక్షలలోపే ఉన్నపుడు అతని మొత్తం బాకీ ఎందుకు మాఫీ చేయలేదు? ఈ విడతల వారీగా చేసి రైతులను మోసం చేసిన్రు. కనీసం సర్వేనైనా తొందరగా చేస్తున్నరా..? అంటే అదీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలె.
– చింతిరెడ్డి వెంకటరెడ్డి, రైతు (కన్నాపూర్)