Retirement benefits | కరీంనగర్ కలెక్టరేట్, డిసెంబర్ 24 : పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల కోసం ప్రభుత్వంపై విశ్రాంత ఉద్యోగుల ఒత్తిడి రోజురోజుకు తీవ్రమవుతున్నది. రిటైర్మెంట్ అయిన రెండు నెలల లోపే చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఏళ్ళు గడుస్తున్న అందకపోవటంతో, విశ్రాంత ఉద్యోగుల్లో అసంతృప్తి పెల్లుబికుతున్నది. ప్రయోజనాల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిని ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆందోళనల దిశగా అడుగులు వేశారు.
అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తమ నిరసనలను పతాక స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట బుధవారం ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వందలాదిగా తరలివచ్చిన విశ్రాంత ఉద్యోగులు దీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రేవా రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పదవీ విరమణ ప్రయోజనాలు అందక అనారోగ్యాల బారిన పడుతూ పాలై మరణిస్తున్నా, ప్రభుత్వానికి పేను పారుతున్నట్లుగా కూడా లేదని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు, సిఎం, రాష్ట్ర మంత్రులను కూడా కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నా కనికరించకపోవడం దారుణమని విమర్శించారు. 2024 ఏప్రిల్ నుండి పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు రావలసిన పెన్షనరీ బెనిఫిట్స్ సకాలంలో రాక అప్పులు కట్టలేక, పిల్లల వివాహం, చదువులు ఆగిపోయి అవమాన భారంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పెన్షనరీ బెనిఫిట్స్ గత 20 నెలలుగా చెల్లించకపోవడం, వృద్ధాప్యంలో అనేక రకాల రుగ్మతలతో ఆసుపత్రుల పాలై ఖర్చులు భరించలేక కొందరు, రుగ్మతలు వికటించి రెండేళ్ళ లో 40 మందికి పైగా మరణించారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఏప్రిల్ 2024 నుండి సుమారు 9వేల మందికి పైగా రిటైరైతే, ఒక్కొక్కరికి రూ.40 నుండి రూ.80 లక్షల దాకా చెల్లించాల్సి ఉందని, వీటితో పాటు వివిధ ఏరియర్స్, పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన పదిహేను రోజుల్లో నగదు రహిత వైద్య చికిత్స అమలు చేస్తామని మానిఫెస్టోలో పెట్టి 24 నెలలు దాటినా ఇదిగో అదిగో అంటూ, కమిటీలు వేస్తూ మీటింగులు పెడుతూ వారం పది రోజులు అంటూ కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.
ఈహెచ్ఎస్ అమలుకాక, ఆస్పత్రుల్లో చెల్లించాల్సిన బిల్లులు చూసి, గుండెపోటుతో అనేక మంది పెన్షనర్లు మరనిస్తున్నారని, ఈహెచ్ఎస్ అమలు చేస్తే కొంతమందైనా బ్రతికుండేవారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలు సైతం, పరోక్షంగా సహకరించాయని పాలకులు గ్రహించాలన్నారు.వచ్చిన పెన్షన్ వడ్డీకి సరిపోతుంటే, నిత్యావసరాలకు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తోందని, మరి ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తం బెనిఫిట్స్ ఆలస్యం చేయటం వల్ల వడ్డీ ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రతినెల రూ.700 కోట్లు విడుదల చేసి బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి చెయ్యిచ్చిందని అన్నారు. తాము ఆందోళన చేస్తే విడుదల చేసిన మొత్తాలు ఎంప్లాయీస్ పెండింగ్ బిల్లులు, వివిధ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులకు చెల్లిస్తున్నారని దుయ్యబట్టారు. కేవలం 10% మాత్రమే 2024 నుండి రిటైరైన పెన్షనర్లకు చెల్లిస్తున్నారని అసంతృప్తి వెలిబుచ్చారు. ఆత్మహత్యలు, అనారోగ్య మరణాలు పెరగకముందే వెంటనే 2024 ఏప్రిల్ నుండి నేటివరకు రిటైరైన పెన్షనర్లందరికి వెంటనే వారికి రావలసిన బెనిఫిట్స్ జి.పి.యఫ్, జి.ఎల్.ఐ. లీవ్ ఎన్ క్యాష్మాంట్, కమ్యుటేషన్ & గ్రాట్యుటీ వగైరా వెంటనే చెల్లించి, పెన్షనర్లను రక్షించాలన్నారు.
ప్రభుత్వం వెంటనే బడ్జెట్లో కేటాయించబడి, డైవర్ట్ చేయబడి ఇతర పనులకు వాడుకున్న మొత్తాలను తిరిగి వెనక్కి తెప్పించాలని సూచించారు. పెన్షనర్స్ బెనిఫిట్స్ చెల్లించేందుకు మాత్రమే ప్రత్యేక నిధులు కేటాయించి పెన్షనర్లకు మొత్తం బకాయిలు / బెనిఫిట్స్ ఒకేసారి చెల్లించేలా చర్యలు తీసుకునేందుకు మానవత్వంతో ఆలోచించాలని, లేనిపక్షంలో తమ ఆందోళన మరింత తీవ్ర రూపం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని రాష్ట్ర పెన్షనర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ సందర్శించి ప్రసంగించారు తను మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే బకాయిలు మంజూరు చేయకపోతే జనవరి నెలలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామన్నారు. ఈ దీక్ష శిబిరంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్ రావు ఉపాధ్యక్షులు గద్య జగదీశ్వర చారి కోశాధికారి కనపర్తి దివాకర్, పెన్షనర్స్ జెఎసి కోళ్ల రాజమల్లు బోరుపల్లి సత్యనారాయణ కొత్తకొండ రవీందర్రావు సిహెచ్ రామ్మోహన్ బాలయ్య మహిపాల్ రెడ్డి అశోక్ రెడ్డి కటకం రమేష్ కుమారస్వామి మోసం అంజయ్య తిరుపతిరావు, తదితరులు హాజరయ్యారు.