జగిత్యాల/ జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 13: జగిత్యాల నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్లుగా ప్రజారంజక పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని కొనియాడారు. ‘కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లే కాదు.. కైండ్ హార్టెడ్ కమిటెడ్ రెస్పాన్స్‌బుల్ లీడర్’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఓ విధానం లేదని.. రాష్ర్టానికో డిక్లరేషన్లు ఇస్తూ దగా చేస్తున్నదని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పథకాలను కాపీ కొడుతూ ప్రజలను ఆయోమయానికి గురిచేస్తున్నదని దుయ్యబట్టారు. బుధవారం జగిత్యాల సమీపంలోని చల్గల్ మామిడి మార్కెట్ ఆవరణలో బీఆర్ఎస్ జగిత్యాల నియోజకవర్గస్థాయి కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత హాజరై ప్రసంగించారు. ప్రతిపక్ష పార్టీల సమావేశాలు వెలవెలబోతున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ సమ్మేళనం కార్యకర్తల ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నదన్నారు.
ఇందుకు కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలే స్ఫూర్తి అని చెప్పారు. గత ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ 60 వేల మెజార్టీతో గెలిచారని..ఇప్పుడు రెట్టింపు మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో 75 ఏండ్లకాలంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు విజయవంతం కాలేదని, కానీ కేసీఆర్ మాత్రం పోరాట పంథాతో తెలంగాణను సాధించారని చెప్పారు. ప్రజల మద్దతుతో పాలనాపగ్గాలు చేపట్టి రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో నంబర్‌వన్‌గా నిలిపారని ప్రశంసించారు. కాంగ్రెస్ డిక్లరేషన్ల పేరిట దగాచేస్తున్న ధోకాబాజీ పార్టీ అని మండిపడ్డారు. ఇక్కడ ఇష్టమొచ్చిన హామీలిస్తున్న హస్తం నేతలు వారి పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో ఎందుకు అమలు చేయడంలేదని నిలదీశారు. దివ్యాంగులకు కేసీఆర్ ఇప్పటికే రూ. 4 వేల పింఛన్ ఇస్తున్నారని, కానీ జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ‘కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో వెయ్యి రూపాయలకంటే ఎక్కువగా పింఛన్ ఇవ్వడం లేదని..
కానీ ఇక్కడ కన్నతల్లికి అన్నం పెట్టని వాడు..పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్లు ఇష్టమొచ్చిన హామీలను ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అన్ని వర్గాలు, మతాలను సమానంగా ఆదరిస్తుందని చెప్పారు. ‘జగిత్యాల బల్దియాలో కాంగ్రెస్‌కు మెజార్టీ వస్తే జీవన్‌రెడ్డి తన తమ్ముడి భార్యను చైర్పర్సన్ చేశారని..కానీ ఎమ్మెల్యే సంజయ్ ఇందుకు భిన్నంగా జిల్లా పరిషత్‌లో బీఆర్ఎస్ గెలిస్తే ఒక పద్మశాలీ బీసీ బిడ్డను జడ్పీ చైర్‌పర్సన్‌గా చేశారన్నారు. ఇది జీవన్‌రెడ్డి, సంజయ్‌కు ఉన్నా తేడా అన్నారు. ప్రభుత్వం పుష్కలంగా నీళ్లు, నిరంతరం కరెంట్ ఇస్తుండడంతో జగిత్యాల నియోజకవర్గంలో తొమ్మిదేండ్ల క్రితం 20 వేల ఎకరాల్లో ఉన్న వరి విస్తీర్ణం ఇప్పుడు 67 వేల ఎకరాలకు చేరిందన్నారు. రూ. 2731 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అలాగే 63 వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఇందులో 25 వేల మంది బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో బూటకపు హామీలతో వస్తున్న ప్రతిపక్షాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.
జీవన్‌రెడ్డి 2014లో చివరి అవకాశం ఇవ్వాలని ప్రజలను నమ్మించి గెలిచాడని, 2018లో అదే చెప్పాడని, ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన మాటలు నమ్మితే నట్టేట మునగడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే సంజయ్ ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాడని చెప్పారు. అలాంటి నాయకుడిని గెలిపిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో పూర్తయిన 4500 డబుల్బెడ్రూం ఇండ్లను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. జగిత్యాలలో అన్ని కులసంఘాల భవనాలను స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘ భవానికి రెండెకరాల స్థలం కేటాయింపునకు చొరవ చూపాలని మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే సంజయ్‌ను కోరారు. కాగా కార్యకర్తల సమావేశానికి హాజరైన కవితకకు మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మాజీ మంత్రి రాజేశంగౌడ్, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ చీటి వెంకటరావు, బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రూప్సింగ్, జగిత్యాల ఏఎంసీ చైర్మన్ నక్కల రాధ రవీందర్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్లు పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, జోగిన్‌పల్లి సందీప్‌రావు, దావ సురేశ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగింది. మన రాష్ట్ర సంక్షేమ పథకాలను మహారాష్ట్ర, కర్నాటక, రాష్ర్టాల్లో అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. రాబోయేవి జమిలీ ఎన్నికలని ప్రచారం చేస్తున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే జమిలీ ఎన్నికలు అంటున్నది. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో కేంద్రం చెప్పాలి. గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన కల్వకుంట్ల కవిత జగిత్యాల అభివృద్ధికి కృషి చేశారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ జగిత్యాల ప్రాంతానికి ఎం చేశారో చెప్పాలి. జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యేగా మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ను గెలిపించుకోవాలి. కేసీఆర్‌ను హాట్రిక్ సీఎంగా చూడాలి. నియోజకవర్గాలను, రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ
‘అక్కా’ అంటే ‘నేనున్నా’ంటూ అండగా నిలిచే నాయకురాలు ఎమ్మెల్సీ కవిత. జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్‌ను లక్ష మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. పేద, బడుగు బలహీన వర్గాలు, యువత, రైతు బాధను తెలుసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్. 60 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. తొమ్మిదన్నరేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూడాలి. పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి.
– కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే
ఎమ్మెల్సీ కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపించా. విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో నియోజకవర్గాన్ని తీర్చిదిద్దా. 40 ఏండ్లలో జీవన్ రెడ్డి జగిత్యాలకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి. నాలుగున్నరేండ్లలో అంతకంటే రెండింతలు నిధులు నియోజకవర్గానికి తెచ్చా. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు జిల్లా ఏర్పాటుతో పాటు సమీకృత కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల వంటివి జిల్లా కేంద్రంలోకి వచ్చాయి. మరోసారి నన్ను ఆశీర్వదించండి. ఎమ్మెల్సీ కవిత సహకారంతో జగిత్యాలను మరింత ముందుకు తీసుకెళ్తా.
– డాక్టర్ మాకునూరు సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
ఆపద, సంపదలో నేనున్నాను అనే నాయకుడు డాక్టర్ సంజయ్ కుమార్. రాష్ట్ర ఏర్పాటు కోసం బతుకమ్మను ఉద్యమంగా మలచుకున్న మీ అందరి నాయకురాలు కవిత. ఇవాళ జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ప్రతిపక్షాలపై యుద్ధం మొదలైందన్నట్లు ఉన్నది. పల్లె, పట్టణంలో బడి, గుడి, వ్యవసాయం, హైదరాబాద్‌ను చూస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిందా..? లేదా..? తెలుస్తుంది. 60 ఏండ్లలో జరగని ప్రగతి తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో కనిపిస్తుంది. రాష్ర్టాన్ని బొమ్మరిల్లులా అభివృద్ధి చేశాం. అన్ని వర్గాల అభివృద్ధికి చిరునామాగా తెలంగాణను మార్చాం. ఎమ్మెల్సీ కవిత అంటే ధైర్యం, అభివృద్ధి, ఒక ఉద్యమం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలందరిపై ఉన్నది. జగిత్యాలలోని పెద్ద మనిషి ఈ ప్రాంతానికి ఎం చేశారో చెప్పాలి. ఆయనకు రోళ్లవాగు అభివృద్ధి గురించి ఏనాడైనా ఆలోచించారా..? చెరువుల మరమ్మతులు ఎప్పుడైనా చేశారా..? మాయమాటలు, దొంగ మాటలకు ఓటర్లు మోసపోవద్దు. అభివృద్ధి చేసే వాళ్లెవరో ప్రజలు గుర్తించాలి.
– కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర మంత్రి ముందుచూపుతోనే సాగు, తాగునీరు
బీజేపీ రాష్ట్రం, దేశంలో మతం పేరిట చిచ్చుపెడుతున్నది. దేశం పేరు మార్చి రాజకీయం చేస్తున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రైతులు పండించిన ధాన్యాన్ని కొనేదిలేదంటే, సీఎం కేసీఆర్ రైతులపై ప్రేమతో చివరి గింజ వరకూ కొన్నారు. ఆయన అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నారు. గతంలో బీర్పూర్ ప్రాంతంలో సాగునీరు లేకపోతే పిల్లను ఇవ్వలేదు. ఇవాళ కేసీఆర్ ముందుచూపుతో ఆ దుస్థితి దూరమైంది. రాష్ట్రమంతటా వ్యవసాయానికి సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందుతున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వడం లేదు. కానీ, మన రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత చొరవతో బీడీ కార్మికులకు పింఛన్ అందిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వీవోఏలకు రూ.8వేల జీతం చేశారు. ఈ ఘనత కవితకే దక్కుతుంది. ఆమె ఎంపీగా పనిచేసిన సమయంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. ప్రస్తుత ఎంపీ అర్వింద్ జగిత్యాల ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలి. ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఆయనను మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది. అందుకోసం బీఆర్ఎస్ శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలి.
– దావ వసంత, జడ్పీ చైర్పర్సన్ (జగిత్యాల)