Drug-free society | ఫర్టిలైజర్ సిటీ, నవంబర్ 21: భావి భారత పౌరులుగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గోదావరిఖని ఎల్బీనగర్ గల ఇండో అమెరికన్ పాఠశాలలో శుక్రవారం నషా చోడ్ భారత్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
నిషేధిత మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే నష్టాలు అనర్ధాలపై విద్యార్థులకు వివరించారు. క్షణికావేశంలో ఒక్కసారి డ్రగ్స్ కు అలవాటయితే భవిష్యత్ అంధకారం అవుతుందని సూచించారు. మత్తు పదార్థాల ఆలోచనలకు విద్యార్థులు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం చెడు అలవాట్లకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు టీ సంధ్య , ఆర్ సాంబలక్ష్మి, ఎల్ శంకరమ్మ, శ్రీనివాస్, శశిధర్, కృష్ణకుమారి తో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ పేరం హేమలత, ఉపాధ్యాయులు సునీత, స్వప్న రాణి, శివ, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కాగా మత్తు పదార్థాల నిర్మూలనపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి ప్రిన్సిపల్ కృతజ్ఞతలు తెలిపారు.