Manthani | పెద్దపల్లి, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధికార సమయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ప్రచార అసా్త్రలుగా మల్చుకొని మంథని మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తామని మంథని మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త రావుల శ్రీధర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక రాజగృహలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గురువారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ పాలనతో మళ్లీ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి పోయిందన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీ కలవరంలో ఉందన్నారు. కాంగ్రెస్‌పార్టీ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ అపజయాలే బీఆర్ఎస్ గెలుపుకు మలుపు అన్నారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఓరిగింది ఏమిలేదన్నారు. 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను నిండా ముంచిందన్నారు. హామీలతో ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలనే చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల ప్రజల్లో ఉన్న అసహనం ఓవైపు.. బ్లాక్ మెయిల్, మోసాలు, ఆరాచకాలకు పాల్పడిన అభ్యర్థులను ఎంపిక చేయడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఢీలా పడి పోయిందన్నారు. దీంతో ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుకు సాగుతున్నదన్నారు.
ఎన్నడూ లేని విధంగా మంత్రి శ్రీధర్‌బాబు కాలుకు బలుపం కట్టుకొని అభ్యర్థుల గెలుపు కోసం పాకులాడుతారన్నారు. కల్లబొల్లి మాటలతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేందుకు కంకణం కట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు. ఎలాంటి నేర చరిత్ర లేని.. ఆరాచకాలు పాల్పడని.. కులవృత్తులను మాత్రమే నమ్ముకున్న వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయడమే బీఆర్ఎస్ గెలుపుకు మొదటి మెట్టుగా మారిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ 13వార్డుల్లో పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా మారాయన్నారు.
ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా పుట్ట మధూకర్, సర్పంచ్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజలు చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు దీవెనలుగా మారననున్నాయన్నారు. పుట్ట మధూకర్, పుట్ట శైలజలు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తూ వార్డుల్లో ముమ్మరంగా ప్రచారాన్ని చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. 13వార్డులకు 13వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.