మానకొండూర్, అక్టోబర్ 1: ‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఆచరణ సాధ్యంకాని అనేక హామీలు ఇచ్చింది. గెలిచాక మొండి చేయిచూపింది. ఆ హామీలను అమల్లోకి తేవడం చేతగాకే ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నది’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మండిపడ్డారు. మంగళవారం మానకొండూర్‌లోని గడిమహాల్లో విలేకరులతో ఆయన మాట్లాడారు.
రెండురోజుల కింద మానకొండూర్ అభివృద్ధి పనుల పేరిట పర్యటించిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ కేవలం కేటీఆర్, హరీశ్‌రావును తిట్టడానికే ఇక్కడకు వచ్చినట్టు ఉందన్నారు. హైడ్రా విషయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మొసలి కన్నీరు కారుస్తున్నారని సీతక్క ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులే మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత వాగ్దానాలు, అమలుకానీ హామీలతో అధికారంలో వచ్చారని దుయ్యబట్టారు.
బఫర్‌జోన్‌లో అక్రమ కట్టడాలను కూల్చడానికి తీసుకువచ్చిన హైడ్రా జీవోను మొదట స్వాగతించింది ప్రతిపక్ష బీఆర్ఎస్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మాత్రమేనని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ సర్కారు హైడ్రాను వాడుకొని తప్పుల మీద తప్పులు చేస్తున్నదని, నిరుపేద ప్రజల ఉసురు తీసి ధనవంతులకు కొమ్ము కాస్తున్నదని ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చి తమ గోడు వినిపిస్తున్న హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి పక్షాన బరాబర్ కాంగ్రెస్ సర్కారుతో కొట్లాడుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రి కొండ సురేఖపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ, అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ, నాయకులను బద్నాం చేయవద్దని మంత్రి ప్రభాకర్‌కు హితవు పలికారు. ఇక్కడ మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, నాయకులు రామంచ గోపాల్‌రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, ఎస్డీ ఖలీల్ మొహియోద్దీన్, దండబోయిన శేఖర్, రాచకట్ల వెంకటస్వామి, పిండి సందీప్, కొట్టె రఘు, నెల్లి శంకర్, బొల్లం అనిల్ ఉన్నారు.