Korukanti Chander | గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠం సాధించడమే మన ఎజెండా, మన లక్ష్యంగా పెట్టుకుని ప్రతీ బీఆర్ఎస్ సైనికుడు పనిచేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని పట్టణంలోని అడ్దగుంటపల్లి సిరి ఫంక్షన్ హాల్లో సోమవారం రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అబద్దాలు మోస పూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా అస్యహించుకుంటున్నారన్నారు. రామగుండం నియోజకవర్గంలో రెండు సంవత్సరాలుగా కూల్చివేతలు కమీషన్లు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ నేతలకు దిన్యచర్యగా మారిందన్నారు. ప్రశ్నిస్తే కేసులు వారికి పరిపాటిగా మారిందన్నారు. రామగుండం కార్పొరేషన్ ప్రజలంతా కాంగ్రెస్ మోసపూరిత పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చిరు వ్యాపారులు దుకణాలు కుల్చి వారిని రోడ్డుపారేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుందన్నారు. రెండేళ్లలో కూల్చివేతలు, విధ్వంసాలపై ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు.
రామగుండం నగర పాలక సంస్థలో ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసేందుకు సిద్ధం కావాలన్నారు. రోజుకో డివిజన్ చొప్పున బస్తీబాట ద్వారా ఇంటింటికెళ్లి ప్రజలను జాగృతం చేయనున్నామని తెలిపారు. రెండేళ్లలో రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్న కూల్చివేతలు, విధ్వంసాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ఎజెండాగా బీఆర్ఎస్ శ్రేణులు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచార హస్త్రంగా మార్చుకోవాలన్నారు. అర్ధరాత్రి కూల్చివేతలు, విధ్వంసాలతో ప్రజల ఆస్తులకు రక్షణ, భద్రత లేకుండా పోయిందన్నారు.
గత బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్లో జరిగిన అభివృద్ధి, గడప గడపకు సంక్షేమ పథకాలు, కళ్యాణలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్, సిమ్స్ కళాశాల అభి వృద్ధి, ప్రతి డివిజన్‌కు మెరుగైన రోడ్లు తదితర వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి గెలుపే లక్ష్యంగా మనమందరం పని చేయాలన్నారు. అనంతరం ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మూల విజయరెడ్డి, కౌశిక హరి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి, నాయకులు పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, నడిపెల్లి మురళీధర్ రావు, గోపు అయులయ్య యాదవ్, మాజీ జడ్పీటీసి అముల నారాయణ, మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.