కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ నాయకులు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవుపలికారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓ వైపు సీఎం, మంత్రులు అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని, వారి వ్యక్తిగత విబేధాలు తమకేం సంబంధం లేదని మాట్లాడుతున్నారని, కానీ అరికెపూడి గాం ధీ స్వయంగా సీఎం చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని, కార్యకర్తలు, నాయకులను సంప్రదించాకే కాంగ్రెస్‌లో చేరానని గాంధీ నే స్వయంగా చెప్పడం ప్రజలందరూ చూశారని తెలిపారు. ఇప్పుడేమో తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని బుకాయిస్తున్నారని, పదవి కోసం ఇంత దిగజారుడు రాజకీయం చేస్తారా? అని నిలదీశారు. సీఎం, మంత్రులకు ధైర్యం ఉంటే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరడం వల్లే ఆయనకు పీఏసీ చైర్మన్ ఇచ్చామని చెప్పాలని సవాల్ విసిరారు. ఆ ధైర్యం కాంగ్రెస్ నాయకులకు లేదని దుయ్యబట్టారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాటల్లో తప్పు ఏముందని ప్రశ్నించారు.
దేవుళ్ల మీద ఒట్లు పెట్టుడు, సీఎంకు, కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. మనుషులతోపాటు దేవుళ్లను కూడా కాంగ్రెస్ పార్టీ వంచిస్తున్నదని విమర్శించారు. అరికెపూడి గాంధీ నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఆయన మెడలో గులాబీ కండువా వేసుకోవాలని సూచించారు. సిగ్గూ, లజ్జ లేకుండా అరికెపూడి గాంధీ హైదరాబాద్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటిపై అనుచరులతో దాడి చేసి, ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబాల వారందరినీ భయబ్రాంతులకు గురి చేశారని, ఆస్తి నష్టం చేయడమే కాకుండా కౌశిక్‌రెడ్డిపై హత్యా ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ ఘటన సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారని, డీజీపీ ఏం చేస్తున్నారని, గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా? అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలను గేట్ దగ్గర ఆపి, కొట్టండి అని కాంగ్రెస్ కార్యకర్తలను విచ్చలవిడిగా వదిలేస్తారా? అని ప్రశ్నించారు. దీని వెనుక కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహం లేదా? అని, ఇదంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరగలేదా? అని నిలదీశారు. ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు మళ్లీ అబద్ధాలు ఆడుతున్నారని, ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడు కూడా రాజకీయాల్లో చూడలేదన్నారు.