ధర్మపురి, ఆగస్టు 17: దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల అభ్యున్నతికి పాటుపడుతూ వెన్నుదన్నుగా ఉన్నామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆద్వర్యంలో ధర్మపురి పట్టణంలోని షాదీఖానలో టీఆఎస్ఆర్టీసీ ద్వారా నిర్వహించిన హెచ్‌ఎమ్‌వీ డ్రైవింగ్ శిక్షణపై అవగాహన సదస్సు, ఎస్సీ లబ్ధిదారులకు బోర్‌బావుల గ్రౌడింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. గత ప్రభుత్వాలు అవలంభించిన విధానాలతో దళితుల్లో ఎటువంటి పురోగతి కానరాలేదన్నారు. పైగా ప్రభుత్వాల పట్ల అపనమ్మకం ఏర్పడిందన్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని చేపట్టి, కుటుంబాల్లో వెలుగులు నింపారని చెప్పారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున అందజేశామని చెప్పారు. రెండో విడతలో 1100 మం దికి అందజేస్తామని, విడతల వారీగా కాలంలో రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ సాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దళితులను రాష్ట్రసర్కారు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నదని, దళిత పారిశ్రామిక వేత్తలను తయారుచేయడం మునుపటి కంటే సులభతరమైందన్నా రు.
విద్య కోసం ప్రభుత్వం చేసే కృషి ఎవరెస్టు శిఖరం అయితే.. జీవచ్చవాలుగా ఉన్న వెనుకబడిన కులాల వారి జీవనవృత్తులకు ప్రోత్సా హం ఇవ్వడం అంతకంటే ఎక్కువ అన్నారు. అలాగే అన్నీ కులవృత్తులను కాపాడుతూ, పల్లె కన్నీరును తుడుస్తున్నదని చెప్పారు. అనంతరం నియోజకవర్గంలోని ధర్మపురి, వెల్గటూర్, పెగడపల్లి, బుగ్గారం, గొల్లపెల్లి మండలాలకు చెం దిన 364 మంది దళిత రైతులకు 3.18కోట్ల వి లువైన బోర్‌బావుల మంజూరు పత్రాలను మం త్రి అందజేశారు. అలాగే టీఆఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో హెచ్‌ఎమ్‌వీ డ్రైవింగ్ శిక్షణ పొందిన దళిత యువతకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అంతకుముందు ధర్మపురి ఎమ్మెల్యే కార్యాలయంలో ధర్మపురి మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు రూ.5లక్షల 77వేల 500విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. దొంతాపూర్ గ్రామానికి చెందిన అల్లె అరవింద్, సుద్దాల వెంకటేశ్‌ల ఆధ్వర్యంలో 60 మంది యువకులు బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ ఉన్నారు.
దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది. దళిత ప్రజలు నివసించే ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, తాగునీటి సరాఫరా, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరాఫరా వంటి అనేక మౌళిక వసతులను కల్పిస్తున్నది. గత ప్రభుత్వాలు దళితులకు స్వయం ఉపాధి కింద కేవలం 20శాతం మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. యూనిట్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిగేది. కానీ సీఎం కేసీఆర్ బ్యాంకు లింకేజీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన పని లేకుడా దళిత బంధు ద్వారా రూ.10లక్షల సాయాన్ని అందజేస్తున్నరు. ఇలా ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా..? ఒకసారి ఆలోచన చేయాలి.
– దావ వసంత, జడ్పీ చైర్ పర్సన్