Kalvakuntla Vidyasagar Rao | సారంగాపూర్, మే 25: కల్లాలోకి రాజకీయం చేయడానికి రాలేదని, రైతుల కష్టం చూసి వచ్చామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. బీర్ పుర్ మండలంలోని నర్సింహుల పల్లె గ్రామంలోని ఐకేపీ, సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా జెడ్పీ మాజీ ఛైర్మన్ దావ వసంత సురేష్, మాజీ మార్కె ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డితో కలిసి పరిశీలించి వివరాలు తెల్సుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలకు వరి ధాన్యం తడిచి ముద్దైతే ఏ ఒక్క అధికారి గాని నాయకుడు గాని పట్టించుకునే నాధుడే లేడని అన్నారు. ఒకపక్క రైతులు అరిగోస పడుతుంటే రేవంత్ రెడ్డికి అందాల పోటీలు అవసరమా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంటు, నీళ్లు ఇచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని నీళ్లన్నీ సముద్రంలోకి వదిలి కేసీఆర్ ని బద్నాం చేయాలని చూస్తున్నారని మండి పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని అన్నారు.
ప్రభుత్వంపై తిరగబాటు రైతులతోనే మొదలైందని, త్వరలోనే రైతులు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఓట్ల కోసం ప్రతి ఇల్లు తిరిగిన నాయకులు రైతులకు కష్టాలొస్తే ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు లేకున్న రైతులు కష్టపడి పంట పండిస్తే సకాలంలో వరి ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి రైతుల్ని ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు.
తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎల్లవేళలా రైతులకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల బీఆర్ ఎస్ అధ్యక్షుడు తెలు రాజు, మాజీ పాక్స్ చైర్మన్ మెరుగు రాజేశం, మాజీ సర్పంచ్ భూమన్న, పాక్స్ డైరెక్టర్ సతీష్, నాయకులు సుధాకర్, శ్రీనివాస్, సుదర్శన్ లక్ష్మీ నారాయణ, సుధ రమేష్, రాజేందర్ రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.