కార్పొరేషన్, ఆగస్టు 30: దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని, ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో కరీంనగర్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నదని, ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం కరీంనగరంలోని పాతబజార్ శివాలయం కాపువాడ లింక్ రోడ్డు పనులను మేయర్ సునీల్‌రావుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే 2,500 కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్నే మరోసారి అధికారంలోకి తీసుకురావాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం చేస్తున్న పార్టీలకే పట్టం కట్టాలని సూచించారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఇప్పటికి నగరం తన రూపురేఖలను ఎంతగానో మార్చుకుందన్నారు. దొంగ మాటలు చెప్పేవాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఓట్ల కోసం డ్రామాలడే వాళ్లకు అవకాశం ఇస్తే అభివృద్ధి కుంటుపడుతుందని వివరించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా నగరాన్ని రాష్ట్రంలోనే రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట కార్పొరేటర్లు కోల మాలతి సంపత్‌రెడ్డి, నేతి కుంట యాదయ్య, నగరపాలక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.