కరీంనగర్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసి సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. మత్తు పదార్థాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామని, గంజాయి, కొకెన్ వంటి మత్తు పదార్థాలను అరికడుతున్నామని చెప్పా రు. రాష్ట్ర డీజీపీగా జితేందర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన కరీంనగర్‌కు వచ్చారు. ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీలు అఖిల్ మహాజన్, అశోక్ కుమార్ పూల మొకలు అందజేసి స్వాగతం పలికారు. ఆ తర్వాత కమిషనరేట్‌లో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు డివిజన్, సరిల్ వారీగా తమ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు యాక్షన్ ప్లాన్ కలిగి ఉండాలన్నారు. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విచారణ శాస్త్రీయ పద్ధతిలో జరగాలని, అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించి మావోయిస్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో మావోయిస్టులు బాగా నష్టపోయారని, తెలంగాణకు వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అసలైన మావోలు లేరని, బయటకు వెళ్లిపోయారని అన్నారు. నకిలీ మావోయిస్టుల పేరుతో చెలామణి అవుతున్న వారిపై కఠినంగా వ్యహరిస్తున్నామని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల విషయంలో సీఎం సీరియస్‌గా ఉన్నారని, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో గంజాయిని పెద్ద ఎత్తున పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సైబర్ నేరాల బారిన పడ్డవారు ఎవరైనా 1930 యూనివర్సియల్ నంబర్‌కు కాల్ చేస్తే తమ బ్యూరో తక్షణం స్పందిస్తున్నదని వెల్లడించారు. బాధితులకు 85 కోట్ల వరకు తిరిగి ఇప్పించామని, గడిచిన మూడు నెలల్లోనే 59 కోట్లు తిరిగి ఇప్పించామని స్పష్టం చేశారు. ఇటీవల కరీంనగర్లోనూ 1.60 లక్షలు ఒక బాధితుడికి ఇప్పించామని చెప్పారు. పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇప్పటి వరకు 15 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి 13 వేల మందిని నియమించుకున్నామని, వీరంతా ఇప్పుడు శిక్షణలో ఉన్నారని తెలిపారు. రిటైర్మెంట్తో ఏర్పడే ఖాళీలకు నోటిఫికేషన్లు ఇవ్వాలంటే కనీసం రెండు సంవత్సరాలైనా పడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.