KARIMNAGAR BJP | కార్పొరేషన్ మార్చి 28 : కరీంనగర్ తాగునీటి అవసరాల కోసం ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండికి వెంటనే నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు డిమాండ్ చేశారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ఎండిలో ప్రస్తుతం 5.6 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ఎలాంటి అవగాహన ప్రణాళిక లేకుండా ఎల్ఎండి నుంచి ప్రతిరోజు 5700 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారని ఆరోపించారు.
దీనివల్ల రోజురోజుకీ నీటిమట్టం పడిపోతుందని దీంతో నగరంలో నీటి సరఫరా తీవ్ర ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉందన్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా నగరవాసులు ప్రతిరోజు నీటి సరఫరా వల్ల ఇబ్బంది లేకుండా ఉన్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహనా లేని ప్రణాళికా లేని తీరు వల్ల రోజు విడిచి రోజు నీటి సరఫరా చేసే పరిస్థితి దాపురించిందన్నారు.
నగరవాసులకు తాగునీటి కష్టాలు తీసుకు వస్తున్న కుట్రలు ప్రభుత్వం ఎందుకు చేపడుతుందో చెప్పాలన్నారు. మరో వారం రోజులపాటు ఎల్ఎండి నుంచి కిందికి నీటిని వదిలితే ఎల్ఎండిలో కేవలం 3 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంటుందన్నారు. ఇప్పటికే రా వాటర్ తీసుకోవడానికి బూస్టర్ పంపులను వాడాల్సి వస్తుందని నీటిమట్టం మూడు డీఎంసీలకు చేరితే 40 ఎంఎల్డి రా వాటర్ తీసుకోవడం కూడా కష్టంగా మారుతుందన్నారు. దీనివల్ల నగరంలో తాగునీటి సరఫరా అష్ట కష్టాలు పడాల్సి వస్తుందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలలుగా నగరంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కనీసం రోజూ మంచినీటి సరఫరాతో ప్రజలు కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నగరవశులకు ఆసంతృప్తి కూడా లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. నగర ప్రజలను రాగినీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితిని తీసుకువచ్చే విధంగా కుట్రలు పన్నుతున్నది ఎవరో బహిర్గతం కావాలన్నారు.
రానున్న వేసవి యాక్షన్ ప్లాన్ ఇప్పటివరకు ఏం చేశారో ఎలా ముందుకెళ్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.