జగిత్యాల, జనవరి 22(నమస్తే తెలంగాణ)/ జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామ సభలో రచ్చరచ్చ జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల సర్వే సందర్భంగా అర్జీదారుల నుంచి కారోబార్ శ్రావణ్‌కుమార్, కార్యదర్శి రాజిరెడ్డి 500 చొప్పున వసూలు చేశారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో 521 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్జీలు ఇస్తే, 276మందిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేశారంటూ మండిపడ్డారు. అధికారులతో వాదనకు దిగారు. విషయం తెలుసుకున్న మండల ప్రత్యేకాధికారి డాక్టర్ బోనగిరి నరేశ్, ఇతర అధికారులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. కారోబార్ కు, సఫాయిలకు 500 ఇచ్చామని అర్జీదారులు పెద్ద సంఖ్యలో వచ్చి వివరించారు. కొదుపుల భారతమ్మ, హుస్నేన్బీ, లింగంపెల్లి లక్ష్మి, ఇరుదిండ్ల తిరుపతమ్మ, వెంగళదాస్ లక్ష్మి తదితరులు తమ వద్ద పంచాయతీ సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు వాగ్మూలం ఇచ్చారు.
అంతకుముందు సభ ప్రారంభంకాగానే, గ్రామంలో రేషన్‌కార్డులు సరిగా మంజూరు చేయలేదని, అర్హులకు రాలేదని, అలాగే ఇందిరమ్మ ఇండ్లు సైతం మంజూరు కాలేదని, అధికారుల నిర్లక్ష్యవైఖరి వల్లే తమకు నష్టం జరిగిందంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో 111 మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 52 మందికి మాత్రమే మంజూరయ్యాయని, మిగిలిన వారికి ఎందుకు కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఒకే ఇంటిపేరుతో 13 కుటుంబాలు ఉండగా, ఏడు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ రైతు భరోసా పథకాల కోసం ఎంపిక చేశారని, ఇది ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. వసూళ్ల పర్వానికి సంబంధించిన నివేదికను ప్రత్యేకాధికారి నరేశ్.. కలెక్టర్‌కు అందజేయగా, గ్రామ కార్యదర్శి రాజిరెడ్డిని సస్పెండ్ చేస్తూ.. కారోబార్ శ్రావణ్ కుమార్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
నేను ఎవుసం చేసుకొని బతుకుత. గ్రామంలో నాకున్న గుంటన్నర భూమిలో 3/61 నంబర్‌తో పాత ఇల్లు ఉంది. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న. 15 రోజుల కింద కారోబార్ శ్రావణ్‌కుమార్, సఫాయి ఇంటికి వచ్చిన్రు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి ఫొటో, స్థలం ఫొటో అప్లోడ్ చేస్తున్నట్లు చెప్పిన్రు. వివరాలు నమోదు చేయాలంటే బకాయి ఉన్న ఇంటిపన్ను 650 చెల్లించాలని, అలాగే 500 అదనంగా ఇవ్వాలని అడిగిన్రు. ఎందుకు అని అడిగితే ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిగా వివరాలు నమోదు చేస్తామన్నరు. విధి లేని పరిస్థితుల్లో ఇంటిపన్ను 650, వాళ్లు అడిగిన 500 మొత్తం కలిపి 1150 ఫోన్‌పే చేసిన.