చిగురుమామిడి, జూన్ 30: గ్రామంలోని విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు మొగ్గుచూపడంతో ప్రజలంతా ఏకమై ప్రభుత్వ బడిని బతికించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులను స్కూల్‌కు తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రైవేటు బస్సులను అడ్డుకున్నారు. చిగురుమామిడి (Chigurumamidi) మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో 15 మంది విద్యార్థులు, 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఇందులో ముగ్గురు ఉపాధ్యాయులను సుందరగిరి, బొమ్మనపల్లి పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపించారు.
కాగా, గ్రామంలో 8వ తరగతి వరకు చదువుతున్న 39 మంది విద్యార్థులు సమీపంలోని హుస్నాబాద్, ఇతర ప్రైవేటు పాఠశాలలకు బస్సులలో వెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో 15 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో బడి మూతపడే అవకాశం ఉండడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఇటీవల గ్రామం ముఖ్యలతో సమావేశం నిర్వహించారు. సర్కారు బడిని బతికించుకునేందుకు గ్రామస్తులందరూ ఏకమై ప్రైవేటు పాఠశాలల్లో బస్సులను గ్రామానికి రానివ్వ వద్దని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా సోమవారం గ్రామానికి వచ్చిన ప్రైవేటు బస్సులను అడ్డుకున్నారు. గ్రామానికి రావద్దని బస్సు డ్రైవర్లను హెచ్చరించారు. అడ్డుకున్న వారిలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, స్కూల్ దుస్తులను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి వీ. పావని విద్యార్థులను కోరారు.