Vigilance Inspections | గంగాధర, ఏప్రిల్ 20 : గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న రికార్డులను, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించారు. రోజువారీగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ లను గురించి అధికారులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. తనిఖీలు జరుగుతుండగా కార్యాలయంలోకి వచ్చిన కొంతమంది డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ ల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజల నుండి వివరాలు సేకరించారు.
అనంతరం కార్యాలయంలోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే తనిఖీలు నిర్వహించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, రవీందర్, తహసీల్దార్ దినేష్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.