Singareni | గోదావరిఖని : సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా అధికారులు రోడ్డెక్కి చేపట్టిన 15 రోజుల రిలే నిరాహార దీక్షలు ఫలితాన్నిచ్చాయి. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (PRP), వేతన సవరణతో పాటు ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి అధికార సంఘం చేపట్టిన ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అధికారుల సమస్యలను ప్రాధాన్యంగా పరిగణించి త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారులకు కోల్ ఇండియా సంస్థల మాదిరిగా వేతన సవరణ, పీఆర్పీ అమలు అంశాలను త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఇటీవల తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరులో కీలక పాత్ర పోషించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు భట్టి విక్రమార్కను కలిసిన అధికార సంఘం నాయకులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన భట్టి విక్రమార్క సోమవారం సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) గౌతమ్ పోట్రుతో సమీక్ష నిర్వహించారు. అధికారుల సమస్యలను అధికార సంఘం నాయకులతో చర్చించి పరిష్కరించాలని, ఎలాంటి జాప్యం లేకుండా రానున్న రెండు నుంచి మూడు నెలల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఇంధన భద్రత కల్పించడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని, సంస్థ అభివృద్ధిలో అధికారులు, కార్మికుల సేవలు ఎంతో విలువైనవని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి, విక్రయాల్లో పోటీతత్వాన్ని పెంచుతూ, సింగరేణిని బహుముఖ రంగాల్లో విస్తరించి అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు అధికారులు కీలకంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సింగరేణి అధికార సంఘం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అభివృద్ధి, కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధన, అధికారుల సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవకు సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి అధికారుల తరఫున పూర్తి సహకారం అందిస్తామని వారు స్పష్టం చేశారు.