VEENAVANKA OLD SCHOOL | వీణవంక, మార్చి 29 : చిన్నారులు చదువుకునే సెంటర్, చికిత్స కోసం వచ్చే రోగులు, పాఠకులు వెళ్లే గ్రంథాలయం, అందమైన నర్సరీ ఇవన్నీ ఒకే దగ్గర ఉండే ఓల్డ్ ప్రభుత్వ పాఠశాల అది. కానీ అది ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
పాఠశాలలో పేరుకుపోయిన చెత్తాచెదారం
మండల కేంద్రంలో విద్యార్థులు సౌకర్యార్థం నాలుగేళ్ల క్రితం క్రీడా ప్రాంగణంలో నూతన ఉన్నత పాఠశాల భవనాన్ని గత ప్రభుత్వం నూతన పాఠశాల భవన సముదాయాన్ని నిర్మించింది. దీంతో విద్యార్థులకు తరగతులను నూతన పాఠశాల సముదాయంలో బోధిస్తున్నారు. దీంతో పాత పాఠశాల భవన సమూదాయాన్ని గ్రంథాలయం, చిన్నారులకు టీకాలు వేసేందుకు, రోగులకు మందులు ఇచ్చేందుకు వినియోగిస్తున్నారు.
సాయంత్రం వేళల్లో ఆ భవన సమూదాయంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, గేటుకు సరిగా తాళం వేయకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని పలువురు మండిపడుతున్నారు. ఇటీవల ఓ ప్రభుత్వ శాఖకు సంబంధించిన క్లస్టర్ అధికారి సమక్షంలో పెద్ద ఎత్తున దావత్ కార్యక్రమం సైతం జరిగిందని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. కావున అధికారులు ఇప్పటికైనా స్పందించి గేటుకు తాళం వేయడంతో పాటు అధికారుల పర్యవేక్షణ ఉండేలా చూడాలని అధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు