vemulawada | వేములవాడ, జూన్ 24: ఇరాన్ పై అమెరికా దాడి విచారకరమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు. వేములవాడలో ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్నిఖండిస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడారు. సార్వభౌమాధికారం గల దేశంపై అణు బాంబులు తయారు చేస్తున్నారన్న నెపంతో ఇరాన్ ప్రజలు, ఆస్తులను బాంబులతో ధ్వంసం చేయడం చాలా విచారకరమన్నారు.
ఇలాంటి యుద్ధ చర్యల వల్ల పశ్చిమాసియా దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. తీవ్ర గర్షణ వాతావరణం మంచి పరిణామం కాదని దాడులు వెంటనే ఆపి శాంతి వాతావరణం నెలకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఎల్లదేవరాజు, గాజుల పోశెట్టి, అడ్లూరి దేవయ్య, రాజన్న, విక్రమ్, నరేష్, కోరేపు క్రాంతి, పెంట మల్లేశం, రాజు, రఘు తదితర సీపీఐ నాయకులు ఉన్నారు.