యూరియా కొరత తీవ్రంగా వెంటాడుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా సమస్య దారుణంగా ఉన్నది. రోజుల కొద్దీ తిరుగుతున్నా ఒక్క బస్తా దొరకడం లేదు. ఎన్ని ఎకరాలున్నా ఒక్క బ్యాగుకు మించి అందడం లేదు. దొరకక దొరకక దొరికిన ఒక బస్తా ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇలా అన్నదాత అరిగోస పడుతున్నా పట్టించుకునే దిక్కులేదు. సమైక్య రాష్ట్రంలో మాదిరిగానే పోలీస్ పహారా మధ్యన పంపిణీ చేసే దుస్థితి వచ్చింది. చెప్పులు లైన్లో పెడుతూ పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుకు శాపంగా మారినట్టు తెలుస్తుండగా, సర్కారు తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు. కేసీఆర్ పాలనలో యూరియా కోసం ఎన్నడూ గోస పడలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని, రైతులకు ఇబ్బంది రాకుండా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
సిరిసిల్ల రూరల్, ఆగస్టు 29: తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని రైతు వేదికకు యూరియా కోసం శుక్రవారం రైతులు తరలివచ్చారు. 440 యూరియా బస్తాలు రాగా, సుమారు 700మందికిపైగా బారులు తీరారు. అయితే పెద్ద సంఖ్యలో రైతులు రావడంతో పోలీస్ పహారా మధ్యన వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి ఒక బ్యాగు మాత్రమే అందజేశారు. ఇది వరకు బస్తాలు ఇచ్చిన వారికి ఇవ్వకుండా, ఇప్పటి వరకు తీసుకోని వారికి యూరియా అందించే ప్రయత్నం చేశారు. అయితే ఐదు పదెకరాలున్న రైతులకు ఒకటి, రెండు బస్తాలు ఏం సరిపోతాయంటూ పోలీసులు, వ్యవసాయ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో మరో రెండు మూడు రోజుల్లో లోడ్ వస్తుందని, వచ్చిన తర్వా అందిస్తామని సర్ది చెప్పడంతో శాంతించారు.
గన్నేరువరం, ఆగస్టు 29: గన్నేరువరం మండలం గుండ్లపల్లి డీసీఎంఎస్కు శుక్రవారం యూరియా వస్తుందని రైతులు ఉదయం నుంచే పడిగాపులు గాశారు. కానీ, రాకపోవడంతో ఓపిక నశించి గ్రామం మీదుగా వెళ్లే రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు. సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినదించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 29: తమ గ్రామానికి వచ్చిన యూరియా బస్తాలు సరిపోవని ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్కు చెందిన రైతులు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయమే 220 బ్యాగుల లోడ్ వచ్చిందని తెలిసి పాత గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు ఒక్కొక్కరికి ఒక్క బస్తా చొప్పున పంపిణీ చేశారు. పక్కనున్న పదిర గ్రామ రైతులకు బస్తాలు ఇచ్చేందుకు నిరాకరించినా సరిపోలేదు. కొంత మంది నిరాశతో వెనుదిరిగారు. మహిళా సంఘాల పేరుమీద వచ్చిన యూరియా బస్తాలతో సంఘానికి వచ్చే కమీషన్ సరిపోవడం లేదని బస్తాకు అదనంగా 30 చొప్పున వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు మూడున్నరెకరాలున్నది. ఎకరానికి ఒక్క బస్తా ఇచ్చినా అయిపోతుండె. కానీ, ఒకటే బస్తా ఇస్తమంటున్నరు. మూడు బస్తాలైతే పొటాషో, ఏదో కలుపుకొని సల్లుకోవచ్చు. వెంకటాపూరం పోతె మా ఊరికి రావద్దు అంటున్నరు. పదిరకాడైతే మొన్న గొడవైంది. మంచిగ కలిసిమెలిసి ఉండెటోళ్లం. ఇప్పుడు యూరియా కోసం లొల్లులు కావాట్టె. మొన్న వాళ్లు మమ్ములను రానియ్యలేదని ఇయ్యాళ వాళ్లను మా ఊరోళ్లు రానియ్యలేదు. అన్నదమ్ములోలె ఉన్నోళ్లం ఉత్తగ దుశ్మనైతున్నం. 267 ఉండే బస్తాకు ఇప్పుడు 300 తీసుకుంటున్నరు. ఎందుకోసమిట్ల జేస్తుర్రు?
-అనింగారి ఎల్లయ్య, రైతు, హరిదాస్నగర్ (ఎల్లారెడ్డిపేట)
నేను యూరియా కోసం తిరగవట్టి ఇరవై రోజులాయె. ఇప్పుడొక్కటి ఇచ్చిన్రు. మళ్ల దానికి మూడు వందలు తీసుకున్నరు. ఆ బస్తా ఏమూలకు పెట్టాలె. నాకున్నదేమో మూడెన్నర ఎకరాలాయె. మొన్న పదిరకోతె వాళ్లయ్యలేదు. ఇయ్యాళ మా ఊరోళ్లు రావద్దన్నరు. ఒకటే బస్తా ఎట్ల సరిపోతది?
-ఉప్పుల సత్తయ్య, రైతు, హరిదాస్నగర్ (ఎల్లారెడ్డిపేట)
పోయిన పదేళ్లలో యూరియా కోసం ఎన్నడు ఇబ్బంది పడలే. రెండేండ్ల నుంచి చాలా ఇబ్బందైతుంది. సొసైటీల పాసుబుక్ జిరాక్స్ ఇచ్చి వారం రోజులైంది. ఇప్పటి వరకు నాకు ఒక బస్తా కూడా రాలే. పదెకరాల్లో నాటేసిన. ఒక్క బస్తా కూడా చల్లకుంటే పంటెట్ల పండుతది. కావాల్సినంత తెప్పిస్తే రైతులకు ఈ తిప్పలు ఉండేవా..? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ర్టాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లింది. ఎకరాకు మూడు దఫాలుగా యూరియాను వాడే రైతులకు, మొదటి సారే అరిగోస పెడుతున్రు. మళ్లోసారి ఎంత ఇబ్బంది ఉంటదో.
– బండారి మలయ్య, రైతు, మొగ్దుంపూర్ (కరీంనగర్ రూరల్ మండలం)
నాకున్న పదిహేనెకరాల్లో నాటేసిన. కానీ, ఇప్పటి దాకా ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వలే. ఎన్ని ఎకరాలున్నా పాసుబుక్కు ఒకటే బస్తా అంటే పంట సాగు ఎట్ల సాధ్యమైతదో పాలకులు, అధికారులకే తెల్వాలె. నేను పోయిన సోమారం పాసుబుక్, ఆధార్ కార్డు జిరాక్స్లు క్యూల పెట్టిన. అయినా, ఇప్పటిదాకా నా నంబర్ రాలేదని సొసైటోళ్లు అంటున్నరు. ఇవ్వాళ 194 బస్తాలే ఉన్నయ్. నా నంబర్ వచ్చేసరికి మరో వారమయ్యేటట్టుంది. అన్ని రోజులైతే వేసిన వరి ఎట్లుంటది.
– అనుముల తిరుపతి, రైతు, గోపాల్పూర్ (కరీంనగర్ రూరల్ మండలం)
రాయికల్, ఆగస్టు 29 : రాయికల్ మండలం ఇటిక్యాల సొసైటీకి 230 యూరియా బ్యాగులు రాగా, సుమారు 200 మంది రైతులు తరలివచ్చారు. ఒక్కొక్కరికి ఒకటి చొప్పున గరిష్ఠంగా ఒకరికి నాలుగు బస్తాల వరకు అందజేయగా, సుమారు వంద మందికిపైగా యూరియా దొరకక వెనుదిరిగారు. అలాగే అల్లీపూర్ సొసైటీకి లోడ్ వస్తుందని తెలిసి ఉదయమే వంద మందికిపైగా రైతులు తరలివచ్చారు.
పడిగాపులు గాసే ఓపిక లేక చెప్పులను లైన్లో పెట్టారు. గంటల కొద్దీ ఎదురుచూసినా రాకపోవడంతో నిరాశ చెందారు. తీరా వ్యవసాయ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకొని, రైతుల పేర్లు నమోదు చేసుకున్నారు. యారియా రాగానే సీరియల్ నంబర్ ప్రకారం అందిస్తామని సర్ది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.