Sunke Ravi Shankar | గంగాధర, ఆగస్టు 18 : సీఎం రేవంత్‌రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర మండలంలోని గర్శకుర్తి గ్రోమోర్ సెంటర్ వద్ద వర్షంలో గొడుగులు పట్టుకొని లైన్లో నిలుచున్న యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులతో సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎరువుల కోసం క్యూలు కనబడుతున్నాయని, ఎరువులు ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో ఎరువుల దుకాణాల వద్ద ఎప్పుడైనా పోలీసులు కనిపించారా..? అని ప్రశ్నించారు. ఎరువుల బస్తాల కోసం రైతులను లైన్లో నిలుచోబెట్టి పాత రోజులను కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని సుంకె ఎద్దేవా చేశారు. పొద్దున 5 గంటలకే ఎరువుల కేంద్రాల వద్దకు రైతులు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. యూరియా కొరతక కాంగ్రెస్ పాపమే అని, పదేండ్లలో లేని చెప్పుల లైన్లు ఇప్పుడు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్ల రాష్ట్రంలోయూరియా కొరత ఏర్పడిందన్నారు. 16 మంది ఎంపీలు గెలిచి తెలంగాణకు తెచ్చింది గుండుసున్నా అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయాంలో ఇంటికే ఎరువులు తెచ్చి పంపిణీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో సాగు తగ్గినా ఎరువులు దొరకని దుస్థితి నెలకొందన్నారు. కేసీఆర్‌ను తిట్టుడు కాదు, పాలన మీద దృష్టిపెట్టాలని సీఎం రేవంత్‌కు స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డే చెబుతున్నాడని గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు కలిపి 16 మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు ఎరువులు తేవడంలో విఫలమయ్యారని విమర్శించారు. సెమీ కండక్టర్ యూనిట్ ఏపీకి పోతోందని, తెలంగాణకు మాత్రం బడ్జెట్లో కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.