తిమ్మాపూర్ రూరల్ , ఫిబ్రవరి 21: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుబంధు సాయం అందక, సాగు, తాగునీరు కోసం అల్లాడి పోతున్నారు. అందినకాడికి అప్పుచేసి నాట్లు వేస్తే అదనుకు యూరియా లేకపోవడంతో పంటలు చీడపీడల బారిన పడి పాడైపోతున్నాయి. మండలంలో తీవ్ర యూరియా కొరత(Urea shortage) ఉండటంతో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో యూరియా కష్టాలు రెట్టింపవుతున్నాయి. దీంతో తిమ్మాపూర్ మండలంలో యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా మల్లాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా బస్తాల లోడ్ రావడంతో ఒక్కసారిగా రైతులు రావడంతో రైతుల మధ్య గొడవ జరిగింది. లోడు వచ్చిన గంట సేపటికే యూరియా బస్తాలు దొరకక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.