ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 21: కలిసిమెలిసి ఉంటున్న ఇరుగు, పొరుగు గ్రామాల మధ్య యూరియా వైరాన్ని పెంచుతున్నది. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బ్యాగులు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడం లేనిపోని వివాదాలకు తావిస్తున్నది. పది రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్‌కు 300 బ్యాగులు రావడంతో సదరు గ్రామానికి గతంలో అనుబంధ గ్రామంగా ఉండి ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన పోతిరెడ్డిపల్లి గ్రామస్తులకు యూరియా బస్తాలు ఇచ్చేది లేదని వెంకటాపూర్ రైతులు నిరాకరించారు.
దీంతో రైతుల మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకోగా, అందులో కొందరికి మాత్రమే బస్తాలు ఇచ్చారు. దీంతో మిగతావారు అసహనంతో వెనుదిరిగిపోయారు. అలాగే, ఇటీవల తిమ్మాపూర్‌కు యూరియా బస్తాలు రావడంతో బొప్పాపూర్‌కు చెందిన కొందరు రైతులు అక్కడకు చేరుకున్నారు. దీంతో తిమ్మాపూర్ రైతులు తమ గ్రామానికి చెందిన వారికి ఇచ్చిన తర్వాతే ఇతర గ్రామాల వారికివ్వాలని స్పష్టం చేయడంతో బొప్పాపూర్ గ్రామస్తులు ఆవేదనతో వెనుదిరిగారు.
బుధవారం బొప్పాపూర్‌కు యూరియా 460 బస్తాల లోడు రాగా, అందులో 240 బస్తాలు దింపి వెళ్లే క్రమంలో రైతులు అడ్డగించారు. తమను ఇతర గ్రామాల రైతులు రానివ్వడం లేదని, మొత్తం లోడు ఇక్కడే దించాలని పట్టుబట్టారు. సుమారు గంటన్నర సేపు లారీని కదలనివ్వకపోవడంతో అధికారులు స్పందించారు.
రైతులను శాంతింపజేయడంతో లారీని అక్కడ నుంచి పంపించారు. తాజాగా, గురువారం పదిరకు యూరియా బస్తాలు వచ్చాయని పక్క గ్రామమైన హరిదాస్‌నగర్ రైతులు వచ్చారు. దీంతో ముందుగా పదిర గ్రామ రైతులకు ఇవ్వాలని చెప్పడంతో హరిదాస్‌నగర్ రైతులు కొంత ఇబ్బంది పడ్డారు. పదిర రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున ఇచ్చిన తర్వాత మిగిలిన కొన్ని బస్తాలు హరిదాస్‌నగర్ రైతులకు ఇచ్చారు. మరికొంత మందికి రాకపోవడంతో ఆవేదనతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.
వేరే ఊళ్లో ఇస్తలేరు.. ఇక్కడ సరిపోతలేదు..
నేను నాలుగెకరాల్లో నాటేసిన. ఇప్పటికీ నెల పదిహేను రోజులైతుంది. ఇవారకు ఒక సంచి యూరియా దొర్కలే. ఇప్పుడు రైతుకొక్క సంచి ఇత్తమంటున్నరు. మా ఊరి కోసం కట్టిన సర్వాయిపల్లి గోదాంకు యూరియా వస్తే పక్క మండలపోళ్లు తీసుకపోతరు. మాకే దొర్కది. మొన్న తిమ్మాపూర్వోతె మీ ఊరోళ్లు ఇక్కడికి రావద్దని ఆధార్‌కార్డులు ఇచ్చేసి వాపసు పంపిచ్చిన్రు. కానీ, తిమ్మాపూరోళ్లు మా దగ్గర ఐకేపీ వడ్లు కొనేతానికి పోస్తరు. యూరియా లేకనే పక్కూళ్లెకు పోతరు కదా.. వాళ్లేమో వద్దనవట్టిరి. బొప్పాపూరోళ్లు రైతులు కాదా.. మాకు యూరియా ఇయ్యరా మరి.
– అరికాల మల్లేశం, రైతు, (బొప్పాపూర్)