ఉమ్మడి జిల్లాలో యూరియా నిల్వలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఒక్క బస్తా కూడా ఇవ్వలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా రావాల్సింది వస్తుందా.. రాదా..? అన్నది అనుమానంగానే ఉన్నది. రైతు కుటుంబం మొత్తం పనులు వదులుకుని తిరగుతున్నా దొరకడం కష్టంగానే ఉన్నది. దాదాపు అంతటా ఇలాంటి పరిస్థితే ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని రైతులు ఆగ్రహిస్తున్నారు. కొరతకు పరిష్కారం చూపాల్సింది పోయి.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే పరిమితమయ్యారని మండిపడుతున్నారు.
– కరీంనగర్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ)
పంటలకు సకాలంలో యూరియా వేస్తేనే మంచి దిగుబడి వస్తుంది. అదును దాటితే దిగుబడి కోల్పోయే ప్రమాదముంటుంది. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. ప్రస్తుతం చాలా వరకు పంటలు చిరుపొట్ట దశలో ఉండగా, ఇప్పుడు యూరియా వేయకపోతే ఎదుగుదలపై ప్రభావం పడి, 30 నుంచి 40 శాతం దిగుబడి తగ్గే ముప్పున్నది. అయితే, ఈ సమయంలో ఎరువు దొరకక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
యూరియా కోసం రైతులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా గోస పడుతున్నారు. వరి నాట్లేసి రెండు నెలలుగా తిరుగుతున్నా సరిపడా దొరక్క ఆగమవుతున్నారు. అయితే, అదునులోనే వేయకపోతే పంట దిగుబడి పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన యూరియాను ముందుగా నాట్లు వేసిన రైతులు రెండుసార్లు వినియోగించుకున్నారు. కొందరు ఒకసారి మాత్రమే వాడారు. నాటు వేసిన 20 నుంచి 25 రోజులకు ఒకసారి, 45 నుంచి 50 రోజులకు రెండోసారి, 65 నుంచి 70 రోజులకు మూడోసారి యూరియా వాడుతారు. వానకాలంలో కొందరు రెండు సార్లు మాత్రమే చల్లుతారు. చిరుపొట్ట దశలో యూరియా అందించడం కీలకం కాగా, ఇప్పుడు చాలా వరకు ఆ దశలోనే పంటలు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు యూరియా అందించకుంటే పంట నష్టం తప్పదని వాపోతున్నారు. పైరు ఎదుగుదలలో ప్రభావం పడుతుందని, దీని వల్ల 30 నుంచి 40 శాతం దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. కీలకమైన సెప్టెంబర్లో యూరియా వేయకుంటే పత్తి పంటకు కూడా నష్టం వస్తుందని అంటున్నారు. కొరత కారణంగా మక్కకు కూడా వేయలేక పోతున్నారు. వరిని కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. యూరియా అందుబాటులో లేని రైతులు నానో యూరియా వాడాలని అధికారులు చెబుతున్నా రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నానో యూరియా ఏ పంటకు ఏ దశలో వేయాలనే విషయంలో పూర్తిగా అవగాహన లేక దీనిని వాడడం లేదని తెలుస్తున్నది.
వానకాలంలో కరీంనగర్ జిల్లాకు 43,254 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ఇండెంట్ ఇచ్చారు. అందులో భాగంగా మే, జూన్ నుంచి ఇప్పటి వరకు 29,902 మెట్రిక్ టన్నులు ఇవ్వగా, ఇదంతా ఈ నెల 15 వరకు అవసరమైన సింగిల్ విండోలకు సరఫరా చేశారు. ఇక అధికారుల చేతిలో ఒక్కబస్తా కూడా లేదు. సీజన్ ప్రారంభంలో ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ఇంకా 13,352 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. కానీ, ఇది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. కమిషనరేట్ నుంచి మెయిల్ వస్తేగానీ చెప్పలేమని అధికారులు అంటున్నారు. గ్రామస్థాయిలో రైతులకు పంపిణీ చేస్తున్నా సహకార సంఘాల నిర్వాహకులు మాత్రం రైతులకు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. నిజానికి వారం పది రోజుల్లో జిల్లాలో 2 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు తెలుస్తున్నది. మిగిలిన యూరియా ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో.. రాదో.. తెలియని పరిస్థితి ఉన్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు 21 వేల మేట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ ఇండెంట్ పంపించింది. అయితే, ఇప్పటి వరకు 16,897 మెట్రిక్ టన్నులే వచ్చింది. దీంతో జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర కొరత ఏర్పడింది. రైతులు ప్రతి రోజూ రైతులు లైనుకట్టడమో, రోడ్డెక్కి ధర్నా చేయడమో చేస్తున్నారు. ఒకవైపు కొరత లేదంటూ అధికారులు చెబుతున్నా.. మరోవైపు అడిగినన్ని ఇవ్వకుండా ఎందుకు అరిగోస పెడుతున్నారంటూ రైతులు మండి పడుతున్నారు.
రైతులకు సరిపడా యూరియా ఇచ్చాం. ఇప్పటి వరకు 29,902 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశాం. వానకాలం అంచనా ప్రకారం కరీంనగర్ జిల్లాకు 43,254 మెట్రిక్ టన్నులు అవసరం. యూరియా అతిగా వినియోగించవద్దని రైతులకు అవగాహన కల్పించాం. చాలా మంది ఆఖరి దశలో వాడుకున్నారు. వారం పది రోజుల్లో 2 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేశాం. ఇంకా కొంత రావాల్సి ఉన్నది. ఎప్పుడు వస్తుందనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం.
– జే భాగ్యలక్ష్మి, డీఏవో (కరీంనగర్)
కోనరావుపేట, సెప్టెంబర్ 16: యూరియా కోసం కోనరావుపేట మండలం మామిడిపల్లిలో రైతులు రోడ్డెక్కారు. ఆదర్శ రైతు సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 50 మంది రోడ్డుపై ధర్నా చేశారు. సుమారు గంటపాటు బైఠాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినదించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. అనంతరం సొసైటీ చైర్మన్ ముత్యాల కిషన్రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఇలా కొరత ఎప్పుడూ లేదని గుర్తు చేశారు. సొసైటీలో 540మంది సభ్యులు ఉన్నారని, సుమారు 60 నుంచి 70 టన్నుల యూరియా అవసరం ఉంటుందని చెప్పారు. కానీ, ఈ యేడాది పంటలకు సరిపడా దొరకడం లేదని వాపోయారు. ఇప్పటి వరకు సొసైటీకి 15 నుంచి 20టన్నులు మాత్రమే వచ్చిందని, దీంతో పంటల దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించేలా చూడాలని కోరారు. ఏవో సందీప్ అక్కడకు చేరుకొని, యూరియా సమస్య పరిష్కారం కోసం హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.