MLA Dr. Sanjay | కోరుట్ల, నవంబర్ 22: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కోరుట్ల పట్టణంలో యూనిటీ మార్చ్ ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. ఐబి రోడ్డు, నంది చౌరస్తా జాతీయ రహదారి మీదుగా కార్గిల్ చౌరస్తా, కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడారు. ఉక్కుమనిషి సర్దార్ వల్ల భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని యూనిటీ మార్చ్ నిర్వహించామని, దేశానికి ఆయన సేవలు వెలకట్టలేనివి అన్నారు. స్వాతంత్య్రం తర్వాత కూడా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలపడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరువ మరువలేనిదన్నారు. దేశ ఐక్యత కోసం ప్రతిక్షణం పరితపించిన మహనీయుడు వల్లభాయి పటేల్ అని కొనియాడారు.
దేశ ఐక్యత, సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి ఆలోచనల ప్రాముఖ్యత, యువత దేశ నిర్మాణంలో తీసుకోవాల్సిన బాధ్యతలను వారు వివరించారు. విద్యతో పాటు క్రమశిక్షణ, సమాజ సేవ, దేశభక్తి వంటి విలువలను జీవితంలో అలవరచుకోవాలని సూచించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థి, యువతకు శుభాకాంక్షలు తెలిపారు. యువత చైతన్యం దేశ అభివృద్ధికి శక్తి అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నారాయణ, ఎమ్మార్వో సత్య ప్రసాద్, బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.