కరీంనగర్ కార్పొరేషన్/ విద్యానగర్, జూలై 14 : కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులు తీసుకువచ్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నగరాల అభివృద్ధి కోసం రూపొందించే వివిధ పథకాల్లో కరీంనగర్‌ను చేర్చేలా చూస్తానన్నారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన సందర్భంగా ఆయనను మేయర్ వై సునీల్‌రావు, పాలకవర్గ సభ్యులు ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో గజమాలతో సన్మానించి, నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నగరాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. పాలకవర్గ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై మాట్లాడాలని, ప్రచారం కోసం విమర్శలు, గొడవలు మానుకోవాలని సూచించారు. వచ్చే కౌన్సిల్ సమావేశంలో తాను కూడా పాల్లొనేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
నగరాభివృద్ధి కోసం పాలకవర్గం ఒక మంచి ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నగరాల అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుందని, దీని కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కూడా కలిసి చర్చిస్తానని తెలిపారు. అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోతానని చెప్పారు. తనకు భవిష్యత్తును ఇచ్చిన నగరాభివృద్ధి కోసం పని చేస్తానన్నారు. స్మార్ట్‌సిటీకి సంబంధించి మిగిలిన నిధులు వేగంగా విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మాజీ డిప్యూటీ మేయర్లు అబ్బాస్ షమీ, గుగ్గిళ్లపు రమేశ్, పాలకవర్గ సభ్యులు నేతికుంట యాదయ్య, అఖిల్, మహేశ్, బండారి వేణు, తోట రాములు, గందె మాధవి, సుధగోని మాధవి కృష్ణగౌడ్, చొప్పరి జయశ్రీ, రాపర్తి విజయ పాల్గొన్నారు.