కరీంనగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాకు కేంద్రం మరోసారి మొండిచేయి చూపినట్టే కనిపిస్తున్నది. బడ్జెట్లో ఈ సారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరుణ చూపలేదని తెలుస్తున్నది. శనివారం రాత్రి వరకు అందిన వివరాల ప్రకారం చూస్తే.. ఏ ఒక్క విషయంలోనూ ఉమ్మడి జిల్లాకు నేరుగా కేటాయింపులు జరిగినట్టు స్పష్టత లేదు. ఐటీ మినహాయింపుల ద్వారా వేతనజీవులకు ఊరటనిచ్చిన మాట వాస్తవమే అయినా.. మిగిలిన అంశాల్లో మాత్రం మొండిచేయే కనిపిస్తున్నది. రైల్వే కేటాయింపులు జిల్లాల వారీగా తెలియాలంటే పింక్ బుక్ విడుదల కావాల్సి ఉంటుంది. దీనికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నా.. మిగిలిన వాటిపరంగా చూస్తే నిరాశే ఎదురవుతున్నది.
ప్రధానంగా ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, అర్వింద్, గడ్డం వంశీకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఏ ఒక్క ఎంపీ తన మార్క్ చూపలేదు. సిరిసిల్ల నేతన్నల కష్టాలు తీర్చేందుకు మెగా పవర్‌లూం క్లస్టర్ ఇవ్వాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉన్నది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈసారైనా క్టస్లర్ సాధిస్తారని నేతన్నలు ఆశించినా నిరాశే మిగిలింది. అలాగే వేములవాడ రాజన్న దేవస్థానాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రసాద్ స్కీంలో ఈ సారైనా చేరుస్తారనుకున్నా.. దానిపై ఎక్కడా స్పష్టత లేదు. కరీంనగర్‌కు ఒక్క కేంద్ర విద్యాసంస్థ అయిన మంజూరవుతుందని, ప్రధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) లేదా ట్రిపుల్ఐటీ ప్రకటిస్తారని ఆశించినా.. ఎక్కడా దాని ముచ్చటే వినిపించలేదు.
అలాగే కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఏర్పాటును ప్రస్తావించలేదు. కాళేశ్వరం సర్క్యూట్‌పై అస్పష్టతే ఉంది. బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్పందించినా.. ఆయన నియోజకవర్గ పరిధిలో ఏమి కేటాయింపులు జరిగాయో వెల్లడించలేదు. అలాగే ఉమ్మడి జిల్లా కేటాయింపులను వివరించలేదు. చాలాకాలంగా ఐటీ మినహాయింపులు చేయాలని ఉద్యోగులు కోరుతుండగా, కేంద్రం ఇన్నాళ్లకు స్పందించింది. వేతనజీవులకు మాత్రం ఊరటనిచ్చింది. మొత్తంగా శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
కేంద్ర బడ్జెట్ 65 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు, 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించింది. కరోనా సమయంలో నిలిపి వేసిన 18 నెలలు, 36 ఇన్స్టాల్మెంట్స్ కరువు భత్యం విడుదలపై ఎలాంటి ప్రకటన లేదు. సుప్రీంకోర్టు, ఇతర కోర్టులు ఉద్యోగులు, పెన్షనర్లకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదు. పాత పెన్షన్ పథకం, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్, ముఖ్యంగా కేంద్ర ఉద్యోగులకు 8వ పే కమిషన్ ప్రస్తావన లేదు. ఇంటీరియం రిలీఫ్ కూడా లేదు.
ప్రతి జిల్లా కేంద్రంలో కేంద్ర ఆరోగ్యం పథకం సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు ఊసే లేదు. కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు రాష్ట్ర ఉద్యోగుల కంటే చాలా తకువ పెన్షన్ పొందుతున్నారు. కరోనా సమయంలో వృద్ధులకు రైల్వే టికెట్స్ కన్సేషన్ రాయితీ ఎత్తివేశారు. ఇంత వరకు పునరుద్ధరించలేదు. దాదాపు 20కోట్ల మధ్య తరగతి వృద్ధులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. జీఎస్టీ పన్నులు ఎన్నోసార్లు పెరిగి ఆర్థిక మెరుగు ఉన్నా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. భారత్ పోస్టల్ శాఖను లాజిస్టిక్ సేవగా మార్చాలనే ఆలోచనను కేంద్రం విరమించుకోవాలి.
– ఉప్పల రామేశం, రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు ఆలిండియా పోస్టల్, ఆర్ఎంఎస్ పెన్షనర్ల అసోసియేషన్
కేంద్ర బడ్జెట్లో కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్‌కు మొండిచేయ్యే దిక్కయింది. కరీంనగర్-హసన్‌పర్తి రైల్వేలైన్ ముచ్చటే లేదు. ఇకడి నుంచి కాకినాడ పోర్టు, అకడి నుంచి చైనాకు గ్రానైట్ రవాణా ద్వారా అత్యధిక ఆదాయాన్నిస్తున్న కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ కూడా గాలికి వదిలేశారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి విద్యా వైద్య ఇన్స్టిట్యూట్స్ గానీ, సైనిక్ సూల్స్ గురించి గానీ ఎకడా ప్రస్తావించ లేదు.
పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నవోదయ విద్యాలయాల కేటాయింపు జరుగలేదు. ఈ రాష్ట్రం నుంచి బీజేపీకి ఎనిమిది మంది, కాంగ్రెస్‌కు మరో ఎనిమిది మంది ఎంపీలు ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. కేంద్రంలో రెండు మంత్రి పదవులు, అందులో మన కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ ఉన్నా.. కరీంనగర్‌కు నిధులు తేవడంలో విఫలమయ్యారు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఉండి ఉంటే కచ్చితంగా ఈ పరిస్థితి ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ర్టానికి నిధులు తెచ్చేవారు.
– గుంజపడుగు హరి ప్రసాద్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి గుండుసున్నానే దకింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను తన రాజకీయ అవసరాలకే ఉపయోగించుకున్నది తప్పా దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాలపై వివక్ష చూపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన అంశాలకు కూడా బడ్జెట్లో మొండిచేయి చూపింది. దీని ద్వారా కేంద్రం దమననీతి బయటపడింది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తన నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక ప్రాజెక్టు సాధించలేదు. ప్రసాద్ సీమ్‌లో వేములవాడ పుణ్య క్షేత్రానికి చోటు దకకపోవడం బాధాకరం. దీనిపైకేంద్ర సంజయ్ సమాధానం చెప్పాలి.
– వెలిచాల రాజేందర్రావు, కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి
ఊహించనివిధంగా ఆదాయపన్ను చెల్లింపుదారులకు పెద్దమొత్తంలో ఆదాయ పరిమితిని పెంచడం ఆనందదాయకం. బేసిక్ పరిమితి 3 లక్షల నుంచి 4 లక్షలకు పెంచుతూ, 7 లక్షల నుంచి 12 లక్షల వరకు పూర్తిగా రిబేట్ ఇవ్వడం వల్ల ఎంతో మంది వేతన జీవులకు ఊరట కలుగుతుంది. ఎంఎస్ఈ పరిమితిని 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచడం వ్యాపారులకు లాభం చేకూరుతుంది. ఆదాయ పన్నుల స్లాబ్ రేట్లు మార్చడం వల్ల పన్ను చెల్లింపు తగ్గుతుంది. వ్యవసాయదారులకు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డ్‌ను 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పరిధి పెంచడం వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంకులో వచ్చే వడ్డీకి టీడీఎస్ 50వేల నుంచి లక్ష వరకు పెంచడం, అలాగే అద్దె చెల్లింపుదారులకు 6 లక్షల వరకు ఎలాంటి టీడీఎస్ లేకపోవడం సంతోషం.
– కర్నెబత్తుల వెంకటేశ్వర్లు, టాక్స్ అడ్వకేట్
రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది, కాంగ్రెస్‌కు ఎంఐఎంతో కలుపుకొని తొమ్మిది మంది ఎంపీలున్నరు. కానీ, కేంద్ర బడ్జెట్లో మనకు దక్కింది గుండు సున్నానే. అదే ఈ రోజు పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే కొట్లాడి నిధులు తెచ్చెటోళ్లు. బీజేపీ ఎంపీలు, నాయకులకు తెలంగాణపై ఇసుమంత ప్రేమ కూడా లేదు. కేంద్రం బీజేపీ పాలిత రాష్ర్టాలను ఒక రకంగా.. బీజేపీ ఏతర రాష్ర్టాలను మరో రకంగా చూడడం అన్యాయం. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.
-కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు
కేంద్రం బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నానే. రాష్ర్టానికి నిధులు కేటాయించడంతో నిర్లక్ష్యం చేసింది. బీజేపీ పాలిత రాష్ర్టాల బడ్జెట్‌లా ఉంది. బీజేపీ పాలిత రాష్ర్టాలకు బడ్జెట్లో పెద్దపీట వేసి, మిగిలిన రాష్ర్టాలకు అన్యాయం చేసింది. గతంలో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడి రాష్ర్టానికి నిధులు తీసుకువచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ 8 నుంచి మంది ఎంపీలు ఉన్నా ఒక్క రూపాయి తీసుకురాలేదు. బడ్జెట్లో బొటాబొటీ నిధులు కేటాయించి సంక్షేమ రంగాన్ని విస్మరించారు. విద్య, ఉపాధి రంగాలను నిర్వీర్యం చేసేలా బడ్జెట్ ఉంది
– సుంకె రవిశంకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే