Ugadi Nalla Vajram Awards | కోల్ సిటీ, మార్చి 29 : గోదావరిఖనిలో కోల్ బెల్ట్ విభిన్న రంగాల కళాకారులు సందడి చేశారు. హైదరాబాద్ తార ఆర్ట్స్ అకాడమి నిర్వహించిన ఉగాది, నల్లవజ్రం పురస్కారాల రెండు రోజుల పండుగ ఆదివారం వైభవోపేతంగా ముగిసింది. స్థానిక మార్కండేయ కాలనీ ఫంక్షన్ హాల్లో ఈ కళోత్సవాలకు ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ, ఏఆర్ ఏసీపీ ప్రతాప్ తదితరులు ముఖ్యతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దర్శకులు ఘంటాడి కృష్ణ సంగీత విభావరి ఆకట్టుకుంది. ఒకే వేదికపై కోల్‌బెల్టు ప్రాంత విభిన్న సంస్కృతుల కళాకారుల ప్రదర్శనలు కళాభిమానులను మంత్రముగ్ధులను చేశాయి.
పలువురు అతిథులు మాట్లాడుతూ ప్రశంసలే కళాకారులను ముందుకు నడిపిస్తాయని నమ్మి తార ఆర్ట్స్ అకాడమి నిర్వాహకుడు సంకె రాజేష్ ప్రతి ఏటా గోదావరిఖనిలో ఈ కళోత్సవాలు నిర్వహించడం శుభ సూచికమన్నారు. కళాకారులు అదృష్టవంతులనీ, ప్రతి వ్యక్తిలో టాలెంట్ ఉండటం సహజమనీ, కానీ, కళలు కొందరిలోనే ఉంటాయనీ, జీవితంలో ఒకే వ్యక్తి ఇద్దరుగా రెండు పాత్రలు పోషించేది ఒక్క కళాకారులేనని గుర్తు చేశారు.
అనంతరం వివిధ రంగాలకు చెందిన ఈద రాంచందర్, పందిళ్ల శ్యాంసుందర్, డాక్టర్ రమేశ్‌బాబు, శ్రీనిధి, మోహన్, వెంకటరాజం, అంజయ్య, గంధం శ్రీనివాస్, కొమ్ము అశోక్ తదితరులకు నల్ల వజ్రం, ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు కే.స్వామి, దామెర శంకర్, మేజిక్ రాజా, దయా నర్సింగ్, చంద్రపాల్, చీకటి అంజయ్య, కనకం రమణయ్య, చల్లా ప్రవీణ్, రాజలింగు, శ్రీనివాస్ తోపాటు పలు జిల్లాలకు చెందిన పురస్కార, అవార్డు గ్రహీతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.