– పేదలకు భూమి దక్కే వరకు పోరాడుతాం
– సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 28 : ముదిగొండ భూ పోరాట అమరవీరుల వారసత్వంతో భవిష్యత్ భూ పోరాటాలకు సిద్ధమవుతామని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మంచికంటి భవన్లో ముదిగొండ భూ పోరాట అమరవీరుల 19వ వర్ధంతి కార్యక్రమం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు లిక్కి బాలరాజు అధ్యక్షతన జరిగింది. ముందుగా అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నరహంతక కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాష్టీకానికి ఏడుగురు అమరవీరులు రక్త తర్పణం చేశారన్నారు. పేదలకు ఇంటి జాగాలు ఇవ్వాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆందోళనకారులపై సాధారణ ప్రజలపై ఆనాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కర్కషంగా వ్యవహరించి కాల్పులు జరిపిందని దుయ్యబట్టారు.
పాలకులు ఎవరైనా భూ పంపిణీ ఎజెండా విషయంలో పేదలను మోసం చేస్తూనే ఉన్నారని, భూ పంపిణీ చేయాలని పోరాడిన వారిపై ఉక్కు పాదం మోపుతున్నారని ఆయన విమర్శించారు. ముదిగొండ భూ పోరాటంలో ఏడుగురు అమరవీరులను పొట్టన పెట్టుకున్నప్పటికీ భూ ఎజెండా అనేది లేకుండా చేయలేకపోయారని అన్నారు. పేదోడికి ఆత్మగౌరవాన్ని ఇచ్చే భూమి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతామని ముదిగొండ భూ పోరాట అమరవీరుల పోరాట స్ఫూర్తి స్పష్టం చేసిందన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని లబ్ధిదారులకు ఇల్లు ఇస్తున్నాం అని ప్రకటనలకే పరిమితం అవుతుందే తప్ప పూర్తిస్థాయి ఇళ్ల పంపిణీలో వైఫల్యం చెందిందని విమర్శించారు.
ప్రభుత్వ ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలను గుర్తించి వారికి పట్టాలు ఇచ్చి పక్కా ఇంటి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ముదిగొండ భూ పోరాట అమరవీరుల వారసత్వానికి కొనసాగింపుగా భూ పోరాటాలను కొనసాగిస్తామని, పేదలకు భూములు దక్కేవరకు పోరాడతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు జిలకర పద్మ, భూక్య రమేష్, టౌన్ కార్యదర్శి వర్గ సభ్యుడు సందకూరి లక్ష్మీ, టౌన్ కమిటీ సభ్యులు జునుమాల నగేష్, సూరం ఐలయ్య, నాయకులు కేహెచ్ ప్రసాద్, రమేష్ బాబు, నర్రా శివరామకృష్ణ, రఘు పాల్గొన్నారు.