– పట్టాల కోసం కొత్తగూడెం పేదల నిరీక్షణకు తెర పడేది ఎప్పుడు
– జీవో 76 అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
– బీఆర్ఎస్ నాయకులు సంకుబాపన అనుదీప్ డిమాండ్
కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 28 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చిన జీవో ఎంఎస్ నెం.76 అమలు పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, కొత్తగూడెం నియోజకవర్గంలోని పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబందించి శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు సంకుబాపన అనుదీప్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 76 ద్వారా ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి మార్గం సుగమం చేసినప్పటికీ, ప్రస్తుతం ఆ జీవో అమలులో జాప్యం ఎందుకు జరుగుతోందో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాలన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో కొత్తగూడెం పేదలకు ఇండ్ల స్థలాలు, గృహ హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మళ్లీ హామీను ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదని దీన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
జీవో 76 కింద కొత్తగూడెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంతమందికి పట్టాలు పంపిణీ చేశారో, ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో పూర్తి వివరాలను విడుదల చేయాలని కోరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికల సమయంలో “100 రోజుల్లో జీవో 76 కింద పట్టాలు అందిస్తాం” అని హామీ ఇచ్చారని, అయితే రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీ అమలు చేయడంలో విఫలమాయ్యారని విమర్శించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి జీవో 76 అమలుకు స్పష్టమైన గడువు ప్రకటించాలని కోరారు. జీవో అమలుకు పరిపాలనా లేదా న్యాయపరమైన అడ్డంకులు ఏమైనా ఉంటే వాటిని ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలుగా ఇండ్ల స్థలాల పట్టాల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు నిర్దిష్ట కాలపట్టిక ప్రకటించి, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా “జీవో ఎంఎస్ నెం.76 ప్రస్తుతం అమలులో ఉందా? లేక నిలిపి వేశారా? అమలులో ఉంటే ఇప్పటివరకు ఎంతమందికి లబ్ధి చేకూరింది? నిలిపివేసి ఉంటే అందుకు గల కారణాలేమిటి? కొత్తగూడెం ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఎప్పుడు అందిస్తారు?” అనే ప్రశ్నలకు ప్రభుత్వం అధికారికంగా సమాధానం ఇవ్వాలని కోరారు. జీవో 76 అమలు స్థితిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి, కొత్తగూడెం నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నిర్దిష్ట గడువులో ఇండ్ల స్థలాల పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రంగరాజు రాజేష్, బత్తుల శ్రీనివాస్, అహ్మద్, గుమ్మడి సాగర్, కలకోటి ఐలయ్య, గాదం రాజేందర్, కాసోజు రామాచారి, న్యాయవాది రాధాకృష్ణ, మున్నా, పిక విద్యాసాగర్ పాల్గొన్నారు.