– మరమ్మతులు చేయించాలని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఎ డిమాండ్
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 17 : కొత్తగూడెం-భద్రాచలం వెళ్లే ప్రధాన రహధారి మార్గంలో మోరంపల్లిబంజర్ వద్ద సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వపై నిర్మించిన వంతెన గుంతలు పడి ఐరన్ రాడ్లు బయటకు వచ్చి ప్రమాదకరంగా మారిందని, తక్షణమే అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేయించి వాహనదారులు, ప్రజల ప్రాణాలు కాపాడాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మాచారి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఎ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాలంగి హరికృష్ణ డిమాండ్ చేశారు.
అంతరాష్ట్ర సంబంధాలతో ముడిపడి ఉన్న జాతీయ రహదారికి సరైన భద్రత లేకుండా నాసిరకంతో నిర్మించిన వంతెన వల్ల ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని నాయకులు ఆరోపించారు. గుంతలు పడి రాడ్లు తేలిన వంతెనను నాయకులు గురువారం పరిశీలించి రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయని, బయటకు వచ్చిన ఇనుప రాడ్లు వాహనటైర్లకు దిగి ప్రమాదాలు జరుగుతున్నా అధికార యంత్రాగంలో చలనంలేదని మండిపడ్డారు. కలెక్టర్, నేషనల్ హైవే అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. మరమ్మతులు చేయించని పక్షంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.