Sultanabad | సుల్తానాబాద్ ఏప్రిల్ 4 : ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రి నగర్, రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రామగుండం పట్టణానికి చెందిన నిషార్ అహ్మద్, గౌస్ అనే ఇద్దరు యువకులు శుక్రవారం తెల్లవారుజామున కరీంనగర్ నుంచి కారులో రామగుండం వైపు వెళ్తున్న క్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రి నగర్ లో అర్ధరాత్రి రోడ్డుపై ఆగి ఉన్న లారీని అతివేగంగా వెనకవైపు నుంచి కారు ఢీకొట్టారు.
దీంతో ఇద్దరు యువకులు నిషార్ అహ్మద్, గౌస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గల కారణం అతివేగమేనని పోలీసులు భావిస్తున్నారు. కారు లారీ ఢీకొట్టిన సమయంలో సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీసులు మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.