Kodimyal | కొడిమ్యాల, ఏప్రిల్ 17 : కొడిమ్యాల మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాదని ఇతరులకు పార్టీలో పెద్దపీట వేస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా తన అనుచరులతో కలిసి కొడిమ్యాల మాజీ సర్పంచి పిడుగు ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 2006 నుండి 2011 వరకు కొడిమ్యాల ఎంపీటీసీగా గెలుపోయిందినట్లు చెప్పారు. 2013 లో కొడిమ్యాల సర్పంచిగా గెలుపొంది, 2014లో పొన్నం ప్రభాకర్, మాజీమంత్రి జీవన్ రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారు. 2019 ఎమ్మెల్యే ఎన్నికలలో మేడిపల్లి సత్యం గెలుపు కోసం గ్రామ గ్రామాన తిరిగినట్లు చెప్పారు. ఎమ్మెల్యే గెలిచిన మేడిపల్లి సత్యం కార్యకర్తల ను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్ లో చెక్కులను దొంగతనంగా డబ్బులు విత్ డ్రా చేసిన వాళ్లను కపాడుకుంటూ సొంత పార్టీ వారిని పక్కన పెడుతున్నాడని మండిపడ్డారు.
మండలంలోని కొనాపూర్ లో ఓ రైతు తన భూమి అమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ కి చెందిన సర్పంచి అడ్డు తగిలి రూ.2లక్షలు డిమాండ్ చేసిన వ్యక్తి ని కాపాడుకుంటూ ప్రజలను పక్కన పెడుతున్నాడని ఆరోపించారు. అందులో ఎమ్మెల్యే వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతం అయిన పూడూర్ ఖాదీ బోర్డు భూము లను పద్మశాలీలకు ఇప్పిస్తానని ఎన్నికల ముందు మాట ఇచ్చి అన్యాక్రాంతం చేసిన వ్యక్తి ని పక్కన పెట్టుకొని వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మండల కేంద్రం లో చిలుక వాగు ప్రక్షాళన, పంపు హౌస్ వద్ద రైతులు వెళ్లేందుకు కాలువ పై బ్రిడ్జి నిర్మిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మాట మరిచాడని ఆరోపించారు. కావున ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా మాజీ ఎంపీటీసీ గడ్డం చంద్రమోహన్ రెడ్డితో పాటు మరో 100 మంది కార్యకర్తలు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.