పసుపు పంటకు కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు మెట్పల్లిలో రోడ్డెక్కారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నోరుమెదపని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహించారు. పసుపు బోర్డు పేరిట ఒకరు, మద్దతు ధర పేరిట మరొకరు ఎన్నికల వేళ ఓట్లకోసం మభ్యపెట్టి లబ్ధిపొందారే తప్ప చేసిందేమీలేదని మండిపడ్డారు. తక్షణమే పసుపునకు మద్దతు ధర ప్రకటించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మెట్పల్ల్లి, మార్చి 11 : పసుపు రైతులు మద్దతు ధర కోసం పోరుబాట పట్టారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని నలుమూలల నుంచి మెట్‌పల్లికి తరలివచ్చారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి 63వ జాతీయ రహదారి మీదుగా ర్యాలీగా పాతబస్టాండ్‌కు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి మెరుపు ధర్నా చేపట్టారు. కనీస గిట్టుబాటు ధర లభించకపోవడంతో పంట సాగుకు పెట్టిన ఖర్చులు నిండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపునకు క్వింటాల్‌కు 15 వేలు మద్దతు ధర ప్రకటించాలని, ఎంఐఎస్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేంద్రాలను ప్రారంభించి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలప్పుడు ఓట్ల కోసం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపునకు మద్దతు ధర కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఎండగట్టారు. మార్కెట్ యార్డులో క్యాష్ కటింగ్‌ను అరికట్టాలని, సిండికేట్‌గా ఏర్పడి పసుపు ధరలను తగ్గిస్తున్న దళారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, రహదారిపై మెరుపు ధర్నాతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోగా, స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చజెప్పేప్రయత్నం చేశారు.
కలెక్టర్ గానీ, ఆర్డీవో గానీ వస్తే తమ గోడును చెప్పుకుంటామని, అంత వరకు ధర్నాను విరమించేదిలేదంటూ భీష్మించుకూర్చున్నారు. పోలీసుల విజ్ఞప్తితో రైతుల వద్దకు ఆర్డీవో శ్రీనివాస్ చేరుకోగా, రైతులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. పసుపునకు మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో శాంతించిన రైతులు ఆందోళనను విరమించారు. ఆందోళనలో రైతు ఐక్యవేదిక నాయకులు, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, మల్లాపూర్, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాలతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
క్వింటాల్ పసుపునకు కనీసం 15 వేలు మద్దతు ధర ప్రకటించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంఐఎస్ స్కీం పథకం కింద కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి పసుపును నేరుగా కొనాలి. పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం సంతోషమే అయినా, మద్దతు ధరను కూడా ప్రకటించి పసుపు రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి.
– బద్దం శ్రీనివాస్‌రెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకుడు (ఇబ్రహీంపట్నం)
పసుపు కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను అరికట్టాలి. నాణ్యత పేరిట మార్కెట్లో దళారులు పసుపు ధరలను రోజురోజుకూ తగ్గిస్తూ రైతులను మోసం చేస్తున్నరు. అసెంబ్లీ ఎన్నికల్లో క్వింటాల్ పసుపునకు కనీసం రూ.12 వేలు మద్దతు ఇస్తామని వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు డిక్లరేషన్‌ను విడుదల చేసిన్రు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిక్లరేషన్‌ను పట్టించుకోవడం లేదు.
– డబ్బ రమేశ్‌రెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకుడు (మల్లాపూర్)
పసుపునకు మద్దతు ధర సాధించుకునే వరకు పోరాటం ఆపేది లేదు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన హామీలు అలాగే మిగిలిపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో పెట్టాలి. దేశానికి అన్నం పెట్టే రైతుల గోసను పట్టించుకుని పసుపు పంటను మద్దతు ధరల జాబితాలో చేర్చి క్వింటాల్‌కు కనీసం 15 వేలు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి.
– గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, పసుపు రైతు, భూషణ్రావుపేట (కథలాపూర్ మండలం)