Fight against cybercrime | సారంగాపూర్, జూలై 6: బీర్ పూర్ మండలంలోని తుంగూరు గ్రామానికి చెందిన కందుకూరి స్వామి అనే యువకుడు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ జిల్లాలో సైబర్ వారియర్ అనే వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. సైబర్ క్రైమ్ వల్ల మోసపోయిన వారికి సలహాలను ఇస్తూ ఇంకా ఎవరూ మోసపోకుండా నష్టపోకుండా అవగాహన కల్పిస్తూ సామాజిక సేవలో పాల్గొంటున్నారు. డిజిటల్ యుగంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్ ను బీర్ పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ కుమార స్వామి ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ కుమార స్వామి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరూ ఇంటర్నెట్ను వాడుతున్నారని, వాడకంతో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ సైబర్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్ వార్డులు ఇతరులతో పంచుకోవద్దని, ఫోన్ కాల్స్, ఫిషింగ్, మెసేజ్‌లు, సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని, లాటరీ మోసాల నుండి అప్రమత్తంగా ఉండాలని యువతను హెచ్చరించారు.
జగిత్యాల సైబర్ వారియర్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కందుకూరి స్వామి మాట్లాడుతూ సైబర్ భద్రత ఇప్పుడు అన్ని వయస్సుల వారికి అవసరమైందని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలా మందికి ఈ మోసాలపై అవగాహన లేదన్నారు. అందుకే ఈ పోస్టర్ రూపకల్పన చేసి సైబర్ వారియర్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం అన్నారు. ప్రతీ నెలా సైబర్ అవగాహన కార్యక్రమాలు, ఆన్లైన్ జూమ్ సెషన్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం మా ప్రణాళిక అని పేర్కొన్నారు.
అందుకే ఈ పోస్టర్ రూపకల్పన చేసి సైబర్ వారియర్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం అన్నారు. ప్రతీ నెలా సైబర్ అవగాహన కార్యక్రమాలు, ఆన్లైన్ జూమ్ సెషన్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం మా ప్రణాళిక అని పేర్కొన్నారు. ఈ పోస్టర్లో ప్రధానంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మోసపోతే ఏ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి 1930, ప్రజలు తక్షణం ఎలా స్పందించాలి అన్న విషయాలను స్పష్టంగా రూపొందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ కుమార స్వామి, హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, కానిస్టేబుల్ సత్యనారాయణ, సంద్య, జగిత్యాల సైబర్ వారియర్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కందుకూరి స్వామి, హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ఆడెపు వెంకటేష్, కందుకూరి మహేష్, కందుకూరి స్వామి తదితరులు పాల్గొన్నారు.