Chada Venkat Reddy | కలెక్టరేట్, జూలై 9 : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం మానవాళికి పెను ముప్పుగా మారుతోందని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధోన్మాదం మరింత పెరిగిందని విమర్శించారు.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అదానీపై అమెరికాలో కేసు ఉపసంహరణ వెనుక ట్రంప్-మోదీ మధ్య ఒప్పందం జరిగి ఉండొచ్చని ఆరోపించారు. అంతర్జాతీయ సమస్యలను యుద్ధాలతో కాకుండా చర్చల ద్వారానే పరిష్కరించాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.