సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ), జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -2026 ప్రక్రియ పురోగతిని సమీక్షించేందుకు ఆయన క్షేత్రస్థాయిలో విసృ్తతంగా పర్యటించారు.
ఈ తనిఖీల్లో భాగంగా శివాబాగ్ కాలనీ, దాసరం బస్తీ హట్స్లోని పోలింగ్ కేంద్రాలు నంబర్లు 139, 146, 160, 161, 162 మరియు 164లను డీఈఓ ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, వాటి డిజిటలైజేషన్ విధానాన్ని డీఈఓ పరిశీలించారు. అనంతరం అకడి బీఎల్ఓలు , ఎన్నికల సిబ్బందితో మాట్లాడి దిశానిర్దేశం చేశారు.
ఎలాంటి తప్పులకు తావు లేకుండా దోషరహిత ఓటర్ల జాబితా తయారు చేయడమే మన లక్ష్యమని కర్ణన్ చెప్పారు. సేకరించిన ఫారాలను నిర్ణీత గడువులోగా కచ్చితత్వంతో డిజిటలైజ్ చేయాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు.
‘క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిషరించుకుని ప్రక్రియ వేగవంతం చేయా’ అని ఆదేశించారు. పర్యటనలో భాగంగా డీఈఓ స్థానిక నివాసితులతోనూ మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒకరూ తమ గణన ఫారాలను సరైన వివరాలతో పూర్తి చేసి బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు. సమగ్రమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఎస్ఐఆర్-2026 ప్రక్రియలో ప్రజలంతా చురుగ్గా పాల్గొనాలని కర్ణన్ పిలుపునిచ్చారు.