మనిషికి హితాన్ని కలిగించి, మంచి మార్గంలో నడిపించే ఒక చక్కని సాధనం సాహిత్యం. నిజం చెప్పాలంటే మనిషి జీవితాన్ని మార్చే శక్తి సాహిత్యానికి ఉన్నది. ఒక వ్యక్తి కష్టాలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే చివరి క్షణంలో ఎక్కడి నుంచో ఒక పాట వినిపించింది. ఆ పాట విని ఆయన ఆత్మహత్యాయత్నం మానుకున్నాడు. ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్లాడు. ఆ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టిన ఆ అద్భుతమైన పాట ‘కల కానిదీ విలువైనదీ..బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు’ ఆ మహిమాన్వితమైన పాటను రాసింది మహాకవి శ్రీశ్రీ. సాహిత్యానికి అంత గొప్ప శక్తి ఉన్నది. ఇలాంటి సంఘటనలు మన తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి.
అదే కోవలో అద్భుతమైన సాహిత్యాన్ని మనకు అందించిన ప్రముఖ విద్వత్కవి, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత వాసాల నరసయ్య.ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల జిల్లా) మెట్పల్లికి సమీపంలోని చౌలమద్ది గ్రామంలో 1942 జనవరి 26వ తేదీన లక్ష్మమ్మ, వెంకటయ్య దంపతులకు వాసాల నరసయ్య జన్మించారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ భాషల్లో చక్కని పాండిత్యం సంపాదించిన ఆయన వ్యాకరణ, అలంకార, కావ్యశాస్ర్తాలు, ప్రబంధాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. చిన్ననాటి నుంచే కవి త్వం పట్ల చక్కని అభిరుచి ఉన్న ఆయ న పద్యాలు, గేయాలు, వచన కవిత లు, నాటికలు, నాటకాలు రచించారు.
‘దున్న భూమి లేనివాన్ని
దున్నలైన లేనివాన్ని
దుక్కి దున్న రానివాన్ని
ఒక్కచోట ఉండనోన్ని
కాలమేమొ వెనుకబడిన
వానలేమొ కురియకున్న
నేలతల్లి ప్రత్యణువుకు
నీరందుట ఎన్నాళ్లకు
దేశమంత పచ్చదనము
తేజరిల్లు టెన్నాళ్లకు’
వర్షాలు లేక నేలతల్లి తల్లడిల్లుతున్న సమయంలో, పంటలు పండక జనం అల్లాడుతున్న తరుణంలో, తాను రైతు కాకున్నా రైతు పడే బాధను చక్కని గేయంలో అందించారు వాసాల నరసయ్య. తల్లి పాడే జానపద గేయాలు, యక్షగానాలు ఆయనను బాగా ఆకర్షించాయి. వాసాల నర్సయ్య పూర్వీకులు వీధి నాటకాలు వేసేవారు. ఆయనకు చిన్నికృష్ణుని వేషం వేయాలనే కోరిక చాలా బలంగా ఉండేది. అప్పుడు ఆయన పశువుల కాపరిగా పనిచేసేవారు. ఆ సమయంలోనే కృష్ణుని మాదిరిగా నామాలు పెట్టుకొని, పంచె కట్టుకొని, తనను తాను కృష్ణునిలా భావించుకొని మురిసిపోయేవారు. విద్యార్థి దశలోనే అంటే 13 ఏండ్ల వయస్సులోనే ‘సౌగంధికాపహరణం’ అనే నాటకం రాశారు నరసయ్య.
‘శ్రమకు వెరచు పిరికివారి
చరిత్రయే నిలువదులే
శ్రమనే ప్రేమించు మనిషి
సేవలె ఇల నిలుచునులే
శ్రమ గీతం పాడు భాయి
శ్రమ గీతం పాడవోయి’
కష్టపడకుండా ఏ వ్యక్తి గొప్పవాడు కాలేడు. చిన్నప్పటి నుంచి కష్టపడడం అలవాటు చేసుకున్న వ్యక్తి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. సోమరిగా తిరిగే వారిని నిరసిస్తూ, శ్రమ గొప్పతనాన్ని తెలియజేస్తూ సరళమైన ఈ గేయాన్ని మనకు అందించారు వాసాల నరసయ్య.
మెట్పల్లిలో విద్యాభ్యాసం పూర్తిచేసిన నరసయ్య ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం సంపాదించుకున్నారు. పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికితీయాలనే ఉద్దేశంతో బాలసాహిత్యాన్ని ఎంచుకొని రచనలు చేశారు. పొడుపు కథలు, కథలు, గేయాలు, వ్యాసాలు, కవితలు, బాలసాహితీవేత్తల సంకలనాలు, నానీలు, తపాలా సాహిత్యం, వచన కవితలు, జీవిత చరిత్రలు మొదలైన ప్రక్రియల్లో రచనలు చేసి అద్భుతమైన సాహిత్యాన్ని మనకు అందించారు నరసయ్య. తర్వాతకాలంలో తపాలా శాఖలోఉద్యోగాన్ని సంపాదించారు. రేడియోలో అనేక సాహిత్య ప్రసంగాలు చేశారు.
కర్షకుడా! కార్మికుడా! చిరుతరగలు, ఈ దేశం, తపాలా చార్జీలు, తపాలా ప్రపంచం, గమ్యం, సమాజానికి సంకెళ్లు, శ్రమగీతం, పొడుపు కథలు, అనాచారాలు అనర్థాలు, చిట్టిపొట్టి కథలు, నవ పల్లవాలు, గోగుపూలు, గులాబీలు, మల్లెమొగ్గలు వంటి 32 పుస్తకాలు ఆయన రాశారు. అందులో చాలావరకు బాల సాహిత్యానికి చెందినవి కావడం విశేషం.
‘ఈ బ్రతుకే…
ఒక ఎడారి పయనం
అయితే కాసింత
సేద తీర్చుకోవడానికి
ఆశలే ఒయాసిస్సులు’
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బాల సాహిత్య పురస్కారం, తెలుగు భాష సంరక్షణ సమితి నుంచి కాళోజీ పురస్కారం, పీవీ నరసింహారావు కళాపీఠం నుంచి జీవన సాఫల్య పురస్కారం, భారత ప్రభు త్వం ద్వారా బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ,
పురస్కారం వంటి అనేక పురస్కారా లు, బిరుదులు, ఎన్నో సాహిత్య సంస్థల నుంచి గౌరవ సత్కారాలు పొం దిన వాసాల నరసయ్య 2021 ఫిబ్రవరి 14న పరమపదించారు.
-తిరునగరి శ్రీనివాసస్వామి
9440369939