Bus pass | కోల్ సిటీ, జూన్ 13: పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు పాస్ ఛార్జీలు పెంచిందని, తగ్గించకపోతే తిరుగుబాటు తప్పదని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి అనంద్ బాబు ఆరోపించారు. గోదావరిఖనిలో ఆయన శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అధిక శాతం విద్యార్థులు మండల, పట్టణ ప్రాంతాలలో గల కళాశాలలకు, పాఠశాలలకు రావడానికి ఆర్టీసీ బస్సులే ఏకైక మార్గంగా ఉన్నాయనీ, అలాంటి విద్యార్థుల బస్సు చార్జీలు నెలకు రూ.400ల నుంచి రూ.600లకు పెంచి ఆర్థిక భారం వేయాలన్న ఆలోచన రావడం సిగ్గుచేటన్నారు.
మూడు నెలల ప్యాకేజీని రూ.1800ల వరకు పెంచడం దారుణమన్నారు. విద్యార్థులకు స్కాలర్ షిప్ లు , ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా చార్జీలను పెంచడం సరికాదన్నారు. మహాలక్ష్మీ పథకం మహిళలకు వరం లాంటిదని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వంకు భావి భారత పౌరులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేడంటేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు విద్యార్థులపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు పిడికిలి బిగించాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు.
ఛార్జీల పెంపు వల్ల ప్రభుత్వంకు వచ్చే ఆదాయంను చూసుకుంటున్నారే తప్ప దాని వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులపై ఎంత ఆర్ధిక భారం పడుతుందో ఆలోచించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికే గురుకులాలను ఎత్తివేస్తూ విద్యారంగంను నిర్వీర్యం చేస్తుందనీ, అది చాలదన్నట్టు ప్రభుత్వ విద్య పేదలకు అందకుండా చేస్తున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు బస్ ఛార్జీలు పెంచి విద్యార్థులు బడులకు రాకుండా చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. ఇక్కడ రక్షణ సమితి కార్యకర్తలు పాల్గొన్నారు.