
Vemulawada | వేములవాడ, జనవరి 12: వేములవాడ పట్టణంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలోని ఆస్తులను బయట వ్యక్తుల ధ్వంసం చేసిన సంబంధిత అధికారులకు సమాచారం లేకపోవడం విధుల పట్ల వారి అంకిత భావాన్ని ప్రశ్నిస్తోంది. వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు 20 ఏళ్లుగా వయసు ఉన్న భారీ నాలుగు వృక్షాలను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేసిన తీరు ప్రస్తుతం చర్చనీ అంశంగా మారింది. ప్రస్తుతం వేములవాడలో వంద పడకల ఆసుపత్రి అందుబాటులోకి రాగా కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు టీకాలు ఇచ్చేందుకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక వేములవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని చెట్ల నరికివేత పై సంబంధిత వైద్యాధికారి దివ్యశ్రీని వివరణ కోరగా తమకు కూడా సమాచారం లేదని పై అధికారులకు తెలిపామని సమాధానం ఇచ్చారు.
పర్యావరణం పై గొడ్డలి పెట్టు..
వేములవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పచ్చని వాతావరణంలోని తలపించే విధంగా ఆవరణ ఉండేది. ఆరోగ్య కేంద్రం ముందు సుమారు 20 ఏళ్ల వయసున్న భారీ 4 వృక్షాలను నేలమట్టం చేశారు. అయితే శని ఆదివారాలు సెలవు దినాలు రావడంతో పూర్తిగా వీటిని తొలగించడమే కాకుండా ముక్కలు ముక్కలుగా చేసి పెట్టారు. పర్యావరణాన్ని కాపాడాలని ఒకవైపు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుండగా మరోవైపు ప్రభుత్వ కార్యాలయంలోని చెట్లను బయట వ్యక్తులు తొలగిస్తున్న తీరు అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. ఒకవైపు ఆర్డీవో కార్యాలయం, మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టీకాల కోసం వచ్చే ప్రజలు సేద తీరే చెట్లను కొట్టివేయడంపై సర్వోత్తర నిరసన వ్యక్తం అవుతుంది.
అవాక్కైనా సిబ్బంది..
చెట్ల తొలగింపు పై ఎవరికి సమాచారం లేకపోగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన నర్సింగ్ సిబ్బంది సైతం అవాక్కయ్యారు. అసలు చెట్ల తొలగింపు ఎలా జరిగిందని ఒకరినొకరు చర్చించుకోవడం కనిపించింది. కార్యాలయం అనుకొని ఉన్న కొన్ని నివాసాలకు సంబంధించి తమకు చెత్తతో ఇబ్బందిగా ఉందని చెప్పిన మాట మాత్రమే తెలుసని వీటిని ఎవరు తొలగించాలనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై వైద్యాధికారి దివ్యశ్రీని వివరణ కోరగా తమకు కూడా సమాచారం లేదని సంబంధిత చెట్ల కొట్టివేత పై జిల్లా అధికారులకు సమాచారం అందించామని చెప్పారు.