పెద్దపల్లి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఓ చిన్న గొడవ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసుల వేధింపుల భయంతో ఆత్మహత్యకు యత్నించి, చావుబతుకుల మధ్య పోరాడాల్సి వస్తున్నది. అయితే కొందరు కాంగ్రెస్ నాయకులు కక్షతోనే తమ కొడుకును తీవ్రంగా కొట్టించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధితుడి తల్లిదండ్రులు శీలం రాజేశ్వరి-దేవేందర్ కథనం ప్రకారం.. మంథని పట్టణంలోని శ్రీపాదకాలనీకి చెందిన యువకుడు శీలం రాజ్‌కుమార్ ఈ నెల 7న సాయంత్రం తన ఇంటి నుంచి మంథని డిపోవైపు వెళ్తున్నాడు.
దారి మధ్యలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో పని చేస్తున్న రాజేశ్ అనే యువకుడు రాజ్‌కుమార్‌ను పిలిచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అంతలోనే గుర్రాల బానయ్య సైతం వచ్చి రాజ్‌కుమార్‌ను కొట్టాడు. మిగతా హమాలీలు వచ్చి విడిపించారు. అక్కడితో ఆ గొడవ ముగిసింది. అయితే మరుసటి రోజు రాజేశ్ తన తోటి హమాలీలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చాడు.
దాంతో ఎస్ఐ రమేశ్ పోలీస్ వాహనంలో రాజ్‌కుమార్ వద్దకు వెళ్లి, వాహనంలో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని తెలిపేందుకు రాజ్‌కుమార్ మంచిర్యాల జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న తండ్రి దేవేందర్‌కు ఫోన్ చేయగా, స్విచ్చాఫ్ వచ్చింది. తర్వాత అదే రోజు రాత్రి 8గంటలకు ముత్తారం మండలం ఓడేడ్‌లో ఉన్న తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా.. నన్ను పోలీసోళ్లు బాగా కొట్టారని చెప్పుకొంటూ’ ఏడ్చాడు.
దాంతో తల్లి తనకు మంథనిలో తెలిసిన రమేశ్‌కు ఫోన్ చేసి విషయం తెలుపడంతో స్టేషన్‌కు వెళ్లి రమేశ్‌ను తీసుకువచ్చాడు. తెల్లవారి మంథనికి వచ్చిన తల్లి, కొడుకు ఒంటిపై దెబ్బలను చూసి తల్లడిల్లింది. అప్పుడే ఇంటికి వచ్చిన తండ్రి దేవేందర్ కొడుకు ఒంటిపై దెబ్బలు చూసి తల్లడిల్లిపోయాడు. గాయాలను తన మొబైల్లో ఫొటోలు తీసి, ఎస్ఐ దగ్గరికి వెళ్లాడు. ‘నా కొడుకును ఇంత దారుణంగా కొడుతారా’..? అని అడిగితే బెదిరించారని ఆరోపించాడు.
పోలీసులు కొట్టడం, మరుసటి రోజు స్టేషన్‌కు రావాలని తరచూ ఫోన్లు చేయడం, మళ్లీ కొడతారనే భయంతో రాజ్‌కుమార్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా, కుటుంబ సభ్యులు కాపాడారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి, పదిరోజులపాటు చికిత్స అందించారు. అయితే వెంటిలేటర్‌పై శ్వాస తప్ప ఎలాంటి కదలికలు లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం మంగళవారం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. తన కొడుకుకు ఈ పరిస్థితిని తీసుకొచ్చిన కాంగ్రెస్ నాయకులు, ఎస్ఐ, సీఐలపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అమ్మా నేను సచ్చిపోతనే, పోలీసోళ్లు మళ్లీ రమ్మంటున్నారే, పొద్దుగాల 10గంటల నుంచి ఎస్ఐ ఫోన్ చేసి రమ్మంటున్నాడే.. అని చెప్పుకొంట నా కొడుకు ఏడ్చిండు. ‘నువ్ పురుషోత్తం రెడ్డి, పాపారావు, కొత్త శ్రీనివాస్, చిన్నను తిడుతున్నావంటరా.. వీళ్లందరినీ (కాంగ్రెస్ నాయకులను) ఎందుకు తిడుతున్నావురా.. వాళ్లు నిన్ను విడిచి పెట్టవద్దంటున్నరు అనుకుంట ఎస్ఐ వాళ్లతో ఫోన్ మాట్లాడుకుంటనే నన్ను కొట్టిండు’ అని నా బిడ్డ చెప్పిండు. నా కొడుకు ‘సత్తా సత్తా’ అంటే పొద్దటి సంది నేను కావలి కాసిన. సాయంత్రం 5 గంటలకు మా అత్తను కావలి ఉంచి నేను స్నానానికి పోయిన. అంతల్నే మా అత్తను పక్కకు దొబ్బి, రూంలకు పోయి తలుపులు వెట్టుకొని ఉరేసుకున్నడు. మేం తలుపులు పలగొట్టి, కిందికి దించినం. దావఖన్ల చేర్పించినం. చెట్టసోంటి కొడుకు కదులుడు లేదు. మొదలుడు లేదు. అట్లనే ఉన్నడు. పది రోజులైతంది. పాయిదా లేక హైదరాబాద్ తీసుకొచ్చినం. మార్కెట్ కోసం నిరుడు నా కొడుకు లొల్లి పెట్టిండు. దాన్ని మనుసుల పెట్టుకొనే ఇదంత చేసిన్రు. కుట్ర పెట్టుకొనే కొట్టించారని నా కొడుకు నాకు జెప్పిండు. నా కొడుకు పరిస్థితికి కారణమైన వాళ్లను వదిలి పెట్టొద్దు. వాళ్లను కఠినంగా శిక్షించాలే.
– బాధితుడి తల్లి శీలం రాజేశ్వరి
చిన్న గొడవైంది. ఆ గొడవకు సీఐకి ఎవరో ఫోన్ చేసిన్రని ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు కలిసి దారుణంగా కొట్టిన్రు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన్రు. మళ్లా రావాలని బెదిరించిన్రు. భయపడే నా కొడుకు ఉరేసుకున్నడు. నేను గొడవ జరిగినప్పుడు ఇంట్లో లేను. కొడుకు ఉరేసుకునేటప్పుడు ఇంట్లో లేను. కొత్త శ్రీను, పురుషోత్తంరెడ్డి, పాపారావు, చిన్న కలిసి నా కొడుకు మీద కేసు పెట్టిచ్చి కొట్టిచ్చిన్రు. నా కొడుకును ఎట్లానైనా బతికించాలే. కొన ఊపిరితో ఉన్నడు. రోజుకు రూ. 50వేలు అయితున్నయి. పరిస్థితి మంచిగా లేదంటే హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకొచ్చినం. మేమే బాధల ఉన్నమంటే మంథని సీఐ, ఎస్ఐలు ఫోన్లు చేసి మమ్ముల బెదిరిస్తున్నరు. ఏదేమైనా నాకొడుకును వాళ్లే బతికించాలే.
– శీలం దేవేందర్, బాధితుడి తండ్రి