Transformer repairing | పెద్దపల్లి, ఆగస్టు11: టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని ట్రాన్స్పార్మర్ రిపేరింగ్ కాంట్రాక్టర్లు సమ్మె బాట పట్టారు. దీంతో జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, కాల్వ శ్రీరాంపూర్, గోదావరిఖని, మంథనిలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో రైతులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రాన్స్పార్మర్ల మరమ్మతులు కోసం 2014లో రెండేళ్ల కోసం ఇచ్చిన ధరలను ఇప్పటి వరకు కొనసాగించటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని సమ్మె చేపట్టాలని రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్స్ రిపేరింగ్ ప్రైవేట్ కాంట్రాక్టర్స్ వేల్పేర్ అసోసియేషన్ పిలుపు మేరకు సమ్మెలోకి వెళ్లినట్లు ఆ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి అలుగుబెల్లి కృష్ణారెడ్డి తెలిపారు.
గత పదేండ్లు ఎన్పీడీసీఎల్ సంస్థలో ప్రైవేట్ ట్రాన్స్ఫార్మర్స్ వేల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రాన్స్పార్మర్లు రిపేర్ చేసి రైతులకు సకాలంలో అందిస్తున్నామని పేర్కొన్నారు. నాడు రేండేళ్ల కోసం నిర్ణయించిన ధరలు పదేండ్లు కోనసాగించటం అన్యాయమన్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు రూ.16 వేల నుంచి రూ.25 వేలు దాకా ఎన్పీడీసీఎల్ సంస్థ ఇస్తుందని చెప్పారు. కరోనా తర్వాత ముడి సరుకులు, రాగి, అల్యూమినియం వైర్, కూలీల ధరలు రెండింతలు పెరిగాయని తెలిపారు.
దీంతో మరమ్మతుల ధరలు పెంచాలని ఎన్పీడీసీఎల్ సంస్థకు పలు మార్లు విన్నవించినా పట్టికోవడం లేదని ఆరోపించారు. ఒక్కో ట్రాన్స్పార్మర్ మర్మమతుకు కనీసం రూ. రూ. 40వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిపేరింగ్ చార్జీలు పెంచే దాకా సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు.
రైతులకు ఇబ్బందులు..
వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బావులు, బోర్వెల్ కింద సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పవు. జిల్లాలోని 6 ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాలో రోజుకు 20-30 ట్రాన్స్ఫార్మర్లు వరకు రిపేర్ అవుతున్నట్లు తెలుస్తుంది. వర్షాలు సరిగా పడకపోవటం, కాలువల నుంచి సాగు నీరు రాకపోవటం రైతులు తమ పంటను కాపాడుకోవటానికి ఎక్కువగా విద్యుత్ మోటర్లు వినియోగిస్తే ట్రాన్స్పార్మర్లు కాలిపోయే అవకాశం లేకపోలేదు. దీంతో సకాలంలో ట్రాన్స్ఫార్మర్ అందకపోతే వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు అవేదన చెందుతున్నారు.
కార్మికులతో చర్చలు సఫలం అయితే ఇబ్బందులు ఉండవు.. : గంగాధర్, ఎస్ఈ, పెద్దపల్లి సర్కిల్
ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కోసం సంస్థ ఇచ్చే డబ్బులను పెంచాలని రిపేరింగ్ చేసే కాంట్రాక్టర్ సమ్మె చేస్తున్నారు. అయితే సంస్థ కాంట్రాక్టర్లను చర్చలకు పిలిచింది. మంగళవారు వరంగల్లో జరిగే చర్చలు సఫలం అయితే ఇబ్బందులు ఉండవు.