కమాన్‌చౌరస్తా/ వేములవాడ, జూలై 31: దేవాదాయ, ధర్మాధాయ శాఖలో బదిలీలు చేస్తూ రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కార్యాలయం నుంచి బుధవారం రాత్రి ఉత్వర్వులు ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అసిస్టెంట్ కమిషనరేట్ పరిధిలో అసిస్టెంట్ కమిషనర్‌తోపాటు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని నియమించారు. అలాగే జిల్లాలోని పలు ఆలయాల ఈవోలను సైతం బదిలీ చేశారు.
కరీంనగర్ అస్టిసెంట్ కమిషనర్, కొండగట్టు ఇన్చార్జి ఈవోగా ఉన్న ఆకునూరి చంద్రశేఖర్‌ను మెదక్ అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. అలాగే హైదరాబాద్ ఎండోమెంట్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ కమిషనర్ ఎం రామకృష్ణారావును కొండగట్టు ఆలయ ఈవోగా నియమించారు. గ్రేడ్-1 ఈవోగా ఉండి ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కే సుధాకర్‌ను కరీంనగర్‌లోని మారెట్ రోడ్డు వేంకటేశ్వర స్వామి ఆలయానికి బదిలీ చేశారు.
కరీంనగర్‌లోని హనుమాన్ సంతోషి మాత ఆలయ ఈవోగా ఉన్న నాగుల అనిల్ కుమార్‌ను తిమ్మాపూర్ మండలం నల్లగొండ సీతారామలక్ష్మి నరసింహాస్వామి ఆలయానికి బదిలీ చేశారు. కరీంనగర్‌లోని విజయగణపతి సాయిబాబా దేవాలయం ఈవో ఏ మారుతిని మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ ఈవోగా నియమించారు.
కరీంనగర్ మంకమ్మతోట వేంకటేశ్వరస్వామి ఆలయంలో గ్రేడ్- 3 ఈవోగా ఉన్న నాగారపు శ్రీనివాస్‌ను గ్రేడ్-2 ఈవోగా పదోన్నతి కల్పిస్తూ కరీంనగర్ జ్యోతినగర్ లోని హనుమాన్ సంతోషి మాత ఆలయానికి కేటాయించారు. అలాగే గ్రేడ్-3 ఈవోగా ఉన్న వామన్ రావుకు పదోన్నతి కల్పిస్తూ జగిత్యాలోని దుబ్బ రాజరాజేశ్వర్ స్వామి ఆలయ ఈవోగా బదిలీ చేశారు. పెద్దపల్లిలోని లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో ఈవోగా ఉన్న ఎం శంకరయ్యను మంథనిలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయ ఈవోగా బదిలీ చేశారు. అలాగే వేములవాడ ఇన్చార్జి ఈవోగా ఉన్న డీసీ వినోద్ రెడ్డికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు.
పాలనలో చంద్రశేఖర్ తనదైన ముద్ర
2020 జూలైలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ అసి స్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆకునూరి చంద్రశేఖర్ ఉమ్మడి జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరతో పాటు, ఇల్లందకుంట, మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అధికారుల సమన్వయంతో నిర్వహించారు. కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి ఇన్చార్జిగా ఉన్న క్రమంలో సైతం తనదైన మృదు స్వభావంతో పలు క్లిష్ట సమయాల్లో బాధ్యతలు నిర్వర్తించి గుర్తింపు తెచ్చుకున్నారు.