న్యూఢిల్లీ : ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై ప్రయాణం కాస్త భారం కానున్నది. ఫాస్టాగ్ వార్షిక పాసు ధరను 2.5 శాతం పెంచాలని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం వార్షిక పాసుకు రూ. 3,000 చెల్లిస్తుండగా ఏప్రిల్ 1నుంచి అది రూ. 3,075 కానున్నది. ఈ పాసు తీసుకున్న వాహన యజమానులు దేశవ్యాప్తంగా 200 టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా ప్రయాణించవచ్చు.
ఫాస్టాగ్ వార్షిక పాసును ప్రవేశపెట్టినపుడు నోటిఫికేషన్లోనే చార్జీల సవరణపై వార్షిక సమీక్ష ఉంటుందన్న నిబంధనను ప్రభుత్వం చేర్చింది. వార్షిక సవరణ ప్రక్రియలో భాగంగానే 2.5 శాతం పెంపు నిర్ణయాన్ని మంత్రిత్వశాఖ తీసుకుంది. దేశంలో 52 లక్షల మందికిపైగా ప్రజలు ఫాస్టాగ్ వార్షిక పాసును ఉపయోగిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 15న ఈ ప్రత్యేక వార్షిక పాసును ప్రభుత్వం ప్రారంభించింది. ఎన్నిసార్లయినా రీచార్జింగ్ చేసుకునే సౌలభ్యం ఉండడం ఈ పాసు ప్రధాన ఆకర్షణ. తరచూ వాహనాల్లో దూర ప్రయాణాలు చేసే వారికి ఈ పాసు చాలా లాభదాయకంగా ఉంది.