వాషింగ్టన్, మార్చి14: ప్రముఖ సోషల్‌మీడియా వేదిక ‘ఫేస్బుక్’ మాతృసంస్థ ‘మెటా’ 2026 ఏడాది ప్రారంభంలోనే భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. కృత్రిమ మేధ (ఏఐ) విభాగంలో పెట్టుబడులను పెంచేందుకు, పాత విభాగాల్లో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నది. ‘మెటా’ మొత్తం సిబ్బందిలో దాదాపు 20 శాతం మందిని తొలగించే ప్రణాళికలో ఉందని, దీంతో సుమారుగా 16,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని ‘రాయిటర్స్’ వార్తా కథనం పేర్కొన్నది. దీని ప్రకారం, లేఆఫ్ ప్రక్రియకు సిద్ధం కావాలంటూ సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ టీమ్ లీడర్స్‌కు తెలియజేశారు. జనరేటివ్ ఏఐ, ఏఐ ఆధారిత ఆపరేషన్స్‌తో సామర్థ్యాల పెంపుదల, డాటా సెంటర్ల విస్తరణపై మార్క్ జుకర్‌బర్గ్ ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. దీనికోసం భారీగా నిధులు కేటాయిస్తున్నారు. జనవరి 2026లో మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగం నుంచి 1,500 మందికి ఉద్వాసన పలికింది. గత కొన్నేండ్లుగా రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో నష్టాలు, ఏఐ అభివృద్ధికి అధిక వ్యయం లేఆఫ్‌లకు ప్రధాన కారణాలుగా తెలిసింది. మెటా తన ఏఐ బృందాలను బలోపేతం చేయడానికి కొత్త నియామకాలను చేపడుతూనే, పాత విభాగాల్లో ఖర్చులను తగ్గిస్తున్నది.
అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ‘నెట్‌ఫ్లిక్స్’ దాని ప్రొడక్ట్, క్రియేటివ్ టీమ్స్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని ఇంటికి పంపింది. ప్రపంచవ్యాప్తంగా 16,000 మంది పనిచేస్తున్న ‘నెట్‌ఫ్లిక్స్’లో ఇటీవల భారీగా ఉద్యోగులను తొలగించినట్టు తెలిసింది. క్రియేటివ్ స్టూడియో యూనిట్‌లోని డిజైనర్లు, ప్రొడ్యూసర్లు తదితరులపై తొలగింపుల ప్రభావం పడినట్టు వార్తలు వెలువడ్డాయి. ఏఐ సాధనాలు, ఆటోమేషన్ వైపు పలు టెక్ కంపెనీలు దృష్టిసారిస్తున్న వేళ ‘నెట్‌ఫ్లిక్స్’ పెద్ద ఎత్తున లేఆఫ్‌లను చేపట్టింది. సంస్థ ఇటీవల వివిధ విభాగాల్లో లీడర్షిప్ మార్పులను చేపట్టింది. సీటీవో ఎలిజబెత్ స్టోన్ పదోన్నతి పొందిన వెంటనే డజన్ల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపును చేపట్టడం గమనార్హం.